రాజధానిపై పదే పదే తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని అమరావతి రైతులు పేర్కొన్నారు. రాజధానికి సమీపంలోని కర్లపూడి క్వారీలో బ్లాస్టింగ్ జరిగితే అమరావతిలో భూకంపం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం అమరావతిలో 438వ రోజు రైతులు ఆందోళనలు చేశారు. మందడం, తుళ్లూరు, దొండపాడు దీక్షాశిబిరాల్లో మహిళలు గీతా పారాయణం చేశారు. అనంతవరం, నెక్కల్లు, పెదపరిమి, లింగాయపాలెంలో వేంకటేశ్వరస్వామికి పూజలు చేశారు. వెంకటపాలెంలో శివపార్వతుల కల్యాణంలో రైతులు పాల్గొని పూజలు చేశారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అబ్బరాజుపాలెంలో నిరసన తెలిపారు. ఉండవల్లి, పెనుమాక, మోతడక, వెలగపూడి, రాయపూడి, బోరుపాలెం, ఐనవోలు తదితర గ్రామాల్లో రైతులు నిరసన తెలిపారు. అమరావతి వెలుగులో భాగంగా రైతులు గ్రామకూడళ్లు, ఇళ్లముందు కొవ్వొత్తులు, కాగడాలతో నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ నెక్కల్లు దీక్షా శిబిరాన్ని సందర్శించి రైతులకు సంఘీబావం ప్రకటించారు.
రాజధానిలో కొనసాగిన రిలే దీక్షలు
విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దని, అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని తుళ్లూరు, పెదపరిమి, ఉద్దండరాయునిపాలెం, అనంతవరంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. అమరావతి దళిత ఐకాస నేతలు దీక్షలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లేఖలు రాస్తేనే సరిపోదు: సీపీఐ నారాయణ