YCP Leaders Attack On TDP Workers: ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరడంతో వైసీపీ దౌర్జన్యాలు, దాడులను పెంచింది. ప్రచారంలో విపక్షాలపై కవ్వింపు చర్యలకు దిగడంతోపాటు మూకదాడులకు పాల్పడుతోంది. అటు ఓటర్లను సైతం ప్రలోభాలకు గురిచేస్తోంది. తమ దారికి రానివారిపై దాడులకు పాల్పడటానికి సైతం వైసీపీ నేతలు వెనకాడటం లేదు.
నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పట్టణంలోని మార్కెట్లో తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి కుమారుడు కాటసాని ఓబుల్ రెడ్డి ప్రచారం చేసి వెళ్లిపోయిన తర్వాత, కొద్దిసేపటికి అక్కడికి తెలుగుదేశం అభ్యర్థి బీసీ జనార్ధన్ రెడ్డి భార్య ఇందిరమ్మ వచ్చి ఎన్నికల ప్రచారం చేశారు. అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. తెలుగుదేశం శ్రేణులు ప్రతిఘటించటంతో గొడవ పెద్దదైంది. పరస్పరం కుర్చీలతో దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కాటసాని ఓబుల్ రెడ్డి, మళ్లీ మార్కెట్‌కు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఇరువర్గాల్ని అడ్డుకున్నారు.
ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరులో తెలుగుదేశం నాయకుడు సత్యనారాయణపై, వైసీపీ మాకలు దాడి చేశాయి. బాధితుడి తలకు తీవ్ర గాయం కావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. తెలుగుదేశంలో చేరికలను ఓర్వలేకనే వైసీపీ మూకలు దాడికి పాల్పడినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని టీడీపీ అభ్యర్థిని గొట్టిపాటి లక్ష్మి పరామర్శించారు. కర్నూలు జిల్లా ఆలూరులో తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ మూకలు దాడి చేశాయి. మనేకుర్తిలో టీడీపీ ప్రచారంలో పాల్గొన్నారంటూ బాధితులపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఘటనలో నలుగురు కార్యకర్తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆలూరు ప్రభుత్వాస్పత్రి తరలించారు.
వైసీపీ నాయకులు ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ఫోటోతో ఓటర్ స్లిప్పుల కూపన్లు పంపిణీ చేశారు. ఓటుకు వెళ్లే ముందు స్లిప్పు చింపుకొని ఉషశ్రీ ఫోటో ఉన్న కూపన్‌తో నగదు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో జగన్ చిత్రంతో మేము సిద్ధం స్టిక్కర్‌ను, ఇంటింటికీ అతికిస్తున్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లు, మరికొందరితో స్టిక్కర్లు అంటించారు. ఇళ్లకు వైసీపీ స్టిక్కర్లు అంటించడంపై తెలుగుదేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది. వైసీపీ స్టిక్కర్లు ఇళ్లకు అతికించేందుకు అనుమతి లేదని.. వాటిని వెంటనే తొలగిస్తామని అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా నెత్తురు పారించిన జగన్ ముఠా - తాలిబాన్లలా వైసీపీ అకృత్యాలు - ysrcp attacks in ap