Vizianagaram District Police Organized Awareness Program on Drugs : కెరీర్‌పై ఎన్నో ఆశలతో కళాశాలలకు వెళ్తారు విద్యార్థులు. కానీ, చెడు సావాసాలతో సరదాగా మొదలవుతున్న మత్తుపదార్థాల వాడకం వారి జీవితాల్నే అంధకారంలోకి నెడుతోంది. విద్యార్థుల బంగారు భవిష్యత్తు మత్తులో కూరుకుపోతోంది. దీన్ని మార్చాలని సంకల్పించారు పోలీసులు. విద్యార్థులతోనే కళాశాల వారిగా కమిటీలు ఏర్పాటు చేసి డ్రగ్స్ నిర్మూలనకు సరికొత్త పంథాను ఎంచుకున్నారు.
విజయనగరం జిల్లా పరిసర ప్రాంతాల్లో మాదకద్రవ్యాల వినియోగం పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో తనిఖీలు జరిపి జిల్లా పోలీసు శాఖ 30కిపైగా కేసులు నమోదు చేసింది. చిరువ్యాపారులు, గంజాయి తీసుకుంటున్న వారు ఇందులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాలు కళాశాలలకు వ్యాప్తి చెందుతున్నాయనే సమాచారం అందుకుని విద్యార్థులకు అవగాహన కల్పించే ఆలోచన చేశారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్.
ఈ "సంకల్పం" కార్యక్రమంలో భాగంగా విజయవగంలోని అన్ని కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు మాదకద్రవ్యాల పట్ల అవగాహన కల్పించాలని నిర్ణయించాం. అలాగే ఆ విద్యాసంస్థల్లో డ్రాప్ బాక్సులు ఏర్పాటు చేస్తున్నాం. వీటి ద్వారా మత్తు పదార్థాల అమ్మకం, వాడకం, రవాణాపై ఫిర్యాదులు చేయవచ్చు. అదేవిధంగా యాంటీ డ్రగ్ కమిటీలను సైతం ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యాక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. రాబోయే రోజుల్లో విద్యార్థులకు మరింతగా అవగాహన కల్పించి మాదకద్రవ్యాల నుంచి దూరం చేస్తాం." - వకుల్ జిందాల్, విజయనగరం జిల్లా ఎస్పీ
మాదక ద్రవ్యాల వ్యతిరేక కమిటీలు : విద్యార్థులకు అవగాహన కల్పించాలని "సంకల్పం" అనే పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎస్పీ వకుల్ జిందల్. ఈ సదస్సుల్లో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను యువతకు వివరించారు పోలీసులు. సందేశాత్మక లఘు చిత్రాలు ప్రదర్శించారు. డ్రగ్స్ పర్యవసనాలపై క్విజ్, ప్రదర్శన పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందచేశారు. కళాశాలల వారీగా మాదక ద్రవ్యాల వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు.
సినీ నటులతో అవగాహన కార్యక్రమాలు : మత్తు పదార్థాల అమ్మకం, వాడకం, రవాణాపై ఫిర్యాదులు చేసేందుకు విద్యాసంస్థల్లో డ్రాప్ బాక్సులు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. విద్యార్థులపై సినిమా ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి సినీ నటులతో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు పోలీసులు. తోటి స్నేహితుల ఒత్తిడి, ప్రలోభాలకు లొంగిపోకుండా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సీనియర్ నటుడు సాయి కుమార్ చెబుతున్నారు.
డ్రగ్స్‌కి దూరంగా ఉంటామంటున్న విద్యార్థులు : మాదకద్రవ్యాలు అలవాటు పడితే వచ్చే పర్యవసానాలపై సంకల్పం సదస్సు ద్వారా అవగాహన కల్పించడం మంచి విషయమని విద్యార్థులు అంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా తమని తాము ఎలా రక్షించుకోవాలో తెలిసిందని డ్రగ్స్‌కి దూరంగా ఉంటామని చెబుతున్నారు. యువతను చెడు మార్గం పట్టిస్తున్న మత్తు పదార్థాల వినియోగం తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు పెరుగుతోంది. దీని అరికట్టేందుకు విజయనగరం పోలీసు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. ఈ సంకల్పం కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తం చేసే దిశగా పోలీసుశాఖ ఆలోచిస్తుంది. ఇలాంటి అవగాహన కార్యక్రమాల వల్ల విద్యార్థులు చైతన్యం అయ్యి చదువులపై దృష్టి పెట్టేందుకు ఆస్కారం ఉంది.