TDP Leaders on Rama Krishna Reddy Pinnelli Issue: మాచర్లలో దాడులకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందుగానే రచించుకున్న వ్యూహానికి కొందరు పోలీసులు దన్నుగా నిలిచారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఈ మేరకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఆయన లేఖ రాశారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని అనుచరులు ఎన్నికల రోజు, తర్వాత రోజు సాగించిన హింసాకాండకు సంబంధించిన ఆధారాలను లేఖకు జత చేశారు.
మాచర్ల మండలం రాయవరం గ్రామంలోని 51వ పోలింగ్ బూత్‌లో వైఎస్సార్సీపీ గూండాలు టీడీపీ ఏజంట్లను బయటకు లాగి దాడి చేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ రిగ్గింగ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఉదాసీనత వైఖరి వల్లే దాడి జరిగిందని, బాధితులను రక్షించడంలో విఫలమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిపురం గ్రామంలో టీడీపీ ఏజంట్ రేఖ్యానాయక్ను బూత్ నుంచి బయటకు బలవంతంగా లాక్కొచ్చి కొట్టి తీవ్రంగా గాయపర్చారని, అనంతరం వైఎస్సార్సీపీ కార్యకర్తలు బూత్ వద్ద రాళ్ల దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. నరసరావుపేట నియోజకవర్గంలో జీవనోపాధి కోసం పని చేసుకునే డీజే శివపై రాడ్లు, కర్రలతో దాడి చేసి వైఎస్సార్సీపీ రౌడీలు చావబాదారని దుయ్యబట్టారు. తెలుగుదేశం కార్యకర్తలు, ఓటర్లపై దాడులకు పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.
TDP Complaint to CEO: ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో వైసీపీ నేతలంతా విధ్వంసానికి పాల్పడిన ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో తక్షణం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి విజ్ఞాపన పత్రాన్ని అందించారు. విధ్వంసానికి పాల్పడిన కేసులో ఎమ్మెల్యేను సమర్ధిస్తున్న వైసీపీ నేతలు కౌంటింగ్ సమయంలో ఎలాంటి చేష్టలకు పాల్పడతారోనన్న ఆందోళన వ్యక్తమవుతోందని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు.
ఎన్నికల్లో భద్రతా లోపాలన్నీ సీఎస్ జవహర్ రెడ్డితో పాటు మాజీ డీజీపీ ఆధ్వర్వంలోనే జరిగాయని టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరావు ఆరోపించారు. ఈవీఎంలు పగలగొట్టిన ఎమ్మెల్యే బయట తిరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. తప్పు చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లికి కఠినంగా శిక్షపడాలని వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే కౌంటింగ్ జరగాలని కోరుతున్నామని స్పష్టం చేశారు.
మరోవైపు కౌంటింగ్ ఏర్పాట్లపై రాజకీయ పార్టీలకు వివరాలను తెలియచేయాల్సి ఉందని టీడీపీ నేతలు తమ విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. కౌంటింగ్ కోసం ఎన్ని టేబుళ్లు వేస్తున్నారు అలాగే ఎన్ని రౌండ్లు నిర్వహిస్తారు, ఎంతమంది కౌంటింగ్ ఏజెంట్లను పెట్టుకోవాలి అన్న అంశాలను తెలియచేయాలని కోరారు. అలాగే కౌంటింగ్ నిర్వహణ కోసం ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు, ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న అంశాన్ని కూడా ఈసీ చెప్పాలని స్పష్టం చేశారు.