Set Fire to TDP Campaign Vehicle: పీలేరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతా రామచంద్రారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలిసేలా ఒక ప్రచార రథాన్ని ఏర్పాటు చేశారు. అయితే అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం విఠలం వద్ద ఉన్న ఆ ప్రచారం వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. డ్రైవర్ వాహనంలో ఉండగానే దుండగులు నిప్పుపెట్టారు. ముఖాలకు మాస్కులు ధరించిన ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి వాహనంపై పెట్రోల్ పోసి నిప్పటించారు. ఈ ఘటనలో డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకున్నారు. ప్రచార వాహనం పూర్తిగా దగ్ధమైంది.
మూడు రోజులుగా తెలుగుదేశం ప్రచార రథం వాల్మీకిపురం మండలంలోనే తిరుగుతుంది. అయితే కొంతమంది వైసీపీకి చెందిన కొంతమంది కార్యకర్తలు, గుర్తు తెలియని వ్యక్తులు వాహనాన్ని అనుసరిస్తున్నారని టీడీపీ నాయకులు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ప్రచారం వాహనానికి నిప్పుపెట్టారు. నిప్పుపెట్టిన దుండగులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకుల రహదారిపై ధర్నాకు దిగారు. నల్లారి కిషోర్ సతీమణి తనూజరెడ్డితో పాటు ఇతర నాయకులు ఆందోళన నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం అవమానకరమన్నారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలపడంతో టీడీపీ నాయకులు ధర్నా విరమించారు.
ఘటనపై పీలేరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదురుగా వచ్చి రాజకీయం చేయలేక దొంగచాటున నిప్పంటించారని మండిపడ్డారు. ప్రచార రథానికి నిప్పు పెట్టినా భయపడేదే లేదని చెప్పారు. నియోజకవర్గంలో టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకుల ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయకుల దౌర్జన్యం: శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం తలమర్లలో తెలుగుదేశం కార్యకర్తపై వైసీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అద్దె ఇంట్లో నివసిస్తున్న టీడీపీ అభిమాని పకీరప్పను ఇంటి నుంచి ఖాళీ చేయించారు. టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడని ఇంటి యజమానిపై ఒత్తిడి తెచ్చిన వైసీపీ నాయకులు, ఖాళీ చేయించేలా చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో టీడీపీ హయాంలో తనకు మంజూరైన స్థలంలో నిర్మించుకుంటున్న ఇంటికి సామాగ్రితో పాటు పకీరప్ప చేరుకున్నారు. ఎలాంటి మౌలిక వసతులు లేని ఇంటిలో కుటుంబసభ్యులతో సహా ఉంటున్నారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి టీడీపీ కార్యకర్త పకీరప్పను పరామర్శించారు.
వైసీపీ నాయకుల ఆగడాలు: ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకుల బరితెగిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల ప్రచారంలో పాల్గొన్న వారిపై దాడులకు తెగబడుతున్నారు. దెందులూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ శుక్రవారం రాత్రి పెదవేగి మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో లక్ష్మీపురం గ్రామంలో ప్రచారం చేస్తుండగా, కొంతమంది వైసీపీ అల్లరి మూకలు అసభ్య పదజాలంతో దూషిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయినా అవేమీ పట్టించుకోకుండా టీడీపీ నేతలు ప్రచారంలో ముందుకు వెళ్తుండగా, లక్ష్మీపురం గ్రామం వీరంపాలెంకి చెందిన బెజవాడ తేజ అనే యువకుడిపై వైసీపీ అల్లరి మూకలు దాడి చేసి గాయపరిచాయి. ఈ దాడిలో గాయపడిన యువకుడు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.