Protest Against YSRCP MLC Ananthababu: దళిత డ్రైవర్‌ని చంపిన కేసులో నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి ఎన్నికల ప్రచారంలో ఘోర పరాభవం ఎదురైంది. అనంతబాబు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడంపై కాకినాడ జిల్లా ధర్మవరం ప్రజలు తీవ్రంగా తప్పుబట్టారు. ఓ ఎస్సీని చంపి దళితల ఆరాధ్య దైవానికి దండ ఎలా వేస్తావంటూ మండిపడ్డారు. దళితవాడల్లోకి అడుగుపెడితే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి సోమవారం రాత్రి నిరసన సెగ తగిలింది. ప్రత్తిపాడు అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు మద్దతుగా ఎమ్మెల్సీ అనంతబాబు, లోక్‌సభ అభ్యర్థి సునీల్ ధర్మవరంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ క్రమంలో అనంతబాబు దళితవాడలో తొలుత వైసీపీలోని ఓ వర్గంతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. దళిత యువకులు, స్థానికులు ఒకచోట చేరి నిలదీద్దామనుకునే సరికి అనంతబాబు ప్రసంగాన్ని ముగించుకుని పక్క వీధిలోకి వెళ్లారు. దళితులంతా నినాదాలు చేసుకుంటూ అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరారు. ఈలోగా ప్రచారం ముగించుకుని వాహనం వద్దకు అనంతబాబు, సుబ్బారావు, సునీల్ చేరుకున్నారు.
వాలంటీర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని సీఈవోకు జేడీ విజ్ఞప్తి - JD And Vijayakumar Complaint to EC
దళితుడ్ని చంపి అంబేడ్కర్ విగ్రహానికి దండేయడానికి సిగ్గులేదా అంటూ స్థానికులు నిలదీశారు. ఓట్ల కోసం పూలమాలలు వేయడానికి వస్తావా.? మా దళిత వాడల్లోకి అడుగు పెట్టొద్దంటూ మండిపడ్డారు. తక్షణమే వెళ్లకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. మీరేం చెయ్యలేరంటూ అనంతబాబు స్థానికులను గద్దించారు. దీంతో స్థానికులు వాహనాన్ని చుట్టుముట్టడానికి సిద్ధమయ్యారు. చేసేది లేక అనంతబాబు, ఇద్దరు వైసీపీ నాయకులు వాహనం ఎక్కి అక్కడ నుంచి జారుకున్నారు.
అనంతబాబు దండవేయడంతో అపవిత్రం అయ్యిందంటూ స్థానికులు అంబేడ్కర్ విగ్రహానికి సోమవారం రాత్రి క్షీరాభిషేకం చేశారు. అనంతబాబు వేసిన దండను తెంపేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భవిష్యత్తులో దళిత వాడల్లో అడుగుపెడితే సహించేది లేదని హెచ్చరించారు.
ప్రచారాన్ని ముమ్మరం చేసిన తెలుగుదేశం నేతలు - TDP leaders Election campaign