MLA Mandali Buddha Prasad Released Water: అవనిగడ్డ ఎమ్యెల్యే మండలి బుద్దప్రసాద్ దివిసీమకు సాగునీరు విడుదల చేశారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి వార్పు వద్ద సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి కేఈబీ ప్రధాన పంట కాలువ ద్వారా వచ్చిన పట్టిసీమ నీటికి కృష్ణానది ఎడమ రెగ్యులేటర్ వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం పులిగడ్డ ఆక్విడెక్టు మీదుగా దివిసీమకు తాగు, సాగునీటిని విడుదల చేశారు.
పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టాకు సాగు, తాగునీరు అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టిసీమను నిర్లక్ష్యం చేసిందని, జగన్ పట్టిసీమను ఒట్టిసీమ అన్నారని గుర్తు చేశారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేయటంతో, రాష్ట్రంలోని ప్రాజెక్టులన్ని ఖాళీగా ఉన్నాయన్నారు. వైఎస్సార్సీపీ పాలకులు పులిగడ్డ ఆక్విడెక్టును, లాకుల గేట్లను కూడా పట్టించుకోలేదన్నారు.
పోలవరం ప్రాజెక్టులో పరవళ్లు తొక్కుతున్న వరదగోదారి - Polavaram Project
కనీసం నిర్వహణ పనులు కూడా చేయని కారణంగా ఎక్కడికక్కడ లాకులు సక్రమంగా పని చేయక, నీరు వృథా అవుతోందన్నారు. ఇటువంటి పరిస్థితిలో అధికారం చేపట్టిన సీఎం చంద్రబాబు, పట్టిసీమను పునరుద్ధరించి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందించి డెల్టా రక్షకుడిగా నిలిచారన్నారు. కృష్ణా డెల్టాలో చిట్టచివరి ప్రాంతమైన అవనిగడ్డ నియోజకవర్గానికి చేరిన పట్టిసీమ నీటితో ముందుగా గ్రామాల్లో తాగునీటి చెరువులు నింపి, అనంతరం వ్యవసాయానికి అందిస్తామన్నారు.
రాష్ట్రంలో అదృష్టవశాత్తూ వర్షాలు కూడా ప్రారంభం కావటం ఆనందదాయకమన్నారు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ఇరిగేషన్ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కానీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన ముగిసే సమయానికి ఇరిగేషన్ శాఖ దగ్గర చిల్లిగవ్వ కూడా లేని దుస్థితి వచ్చిందని మండలి బుద్దప్రసాద్ మండిపడ్డారు. దీని కారణంగా గత ఐదేళ్లలో కోడూరు, నాగాయలంక మండలాల్లో నాలుగు వేల ఎకరాలు సాగుకు నోచుకోలేదన్నారు.
గత పాలకుల వైఫల్యంతో నష్టపోయిన రైతులు ఆత్మహత్య చేసుకున్న దుస్థితి ఎదురైందన్నారు. ఈ నేపథ్యంలో తమపై గురుతర బాధ్యత పడిందన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నిర్లక్ష్యంగా వదిలేసిన డ్రైనేజీలు, పంటకాలువలు సక్రమంగా పని చేసేలా యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టినట్లు తెలిపారు. కాలువల లాకుల అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయించి వచ్చే ఏడాదికి పటిష్టమైన ఇరిగేషన్ వ్యవస్థ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామన్నారు.
ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రైతులకు కష్టం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా పని చేస్తోందన్నారు. ప్రతి చేనుకు నీరు - ప్రతి చేతికి పని నినాదంతో పని చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత వైఎస్సార్సీపీ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. దివిసీమకు నీటిని విడుదల చేయటంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.