Law Student Raped in Tirupati: న్యాయ విద్య చదువుకొని ఆదర్శంగా జీవించాల్సిన యువ దంపతులు దారుణానికి పాల్పడ్డారు. గంజాయికి బానిసలై అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని గంజాయి మత్తు ఊబిలోకి దించారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడి, డబ్బు డిమాండ్ చేసిన ఘటన తిరుపతి జిల్లాలో కలకలం రేపింది.
ఏం జరిగిందంటే: తిరుపతి గ్రామీణ పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం, కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన యువతి (22) నాలుగేళ్ల కిందట తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో (SRI PADMAVATI MAHILA VISVAVIDYALAYAM) ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరారు. కొంతకాలం కాలేజీ వసతిగృహంలో ఉండేవారు. ఆ సమయంలో తిరుపతి గ్రామీణ మండలం పుదిపట్లలో నివాసం ఉంటున్న సహచర విద్యార్థిని సదాశివం ప్రణవకృష్ణ (35) పరిచయమై, ఆమెతో స్నేహం ఏర్పడింది. దీంతో సదరు మహిళా తరచూ ఆమె ఇంటికి వెళ్లివచ్చేవారు. ఆ సమయంలో ప్రణవకృష్ణ భర్త కృష్ణకిషోర్‌రెడ్డితో సైతం ఆమెకు పరిచయమైంది.
తిరుపతి జిల్లా భాకరాపేటకు చెందిన అతను ఎస్వీయూ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గంజాయికి బానిసలైన దంపతులిద్దరూ అప్పుడప్పుడూ ఇంటికి వచ్చే సదరు యువతికి సైతం అలవాటు చేశారు. దీంతో ఆ యువతి గంజాయి మత్తులో ఉన్నప్పుడు కృష్ణకిషోర్‌రెడ్డి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ దృశ్యాలను అతని భార్య వీడియో, ఫొటోలు తీసింది. తరువాత ఆ వీడియోలు, ఫొటోలతో ఆమెను బెదిరించి యువతి నుంచి బంగారు నగలు తీసుకున్నారు. అదే విధంగా ప్రణవ్‌కృష్ణ ఆ ఫొటోలు, వీడియోలను బాధిత యువతి సోదరుడితోపాటు, ఆమెకు కాబోయే భర్తకు సైతం పంపి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధిత యువతి కుటుంబ సభ్యులు ఈ నెల 25వ తేదీన తిరుపతి గ్రామీణ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో కృష్ణకిషోర్‌రెడ్డి, ప్రణవకృష్ణలను ఆయా వర్సిటీల నుంచి సస్పెండ్ చేశారు.
ఆందోళన కలిగిస్తున్న గంజాయి: గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరుపతి నగరం గంజాయితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆధ్యాత్మిక నగరాన్ని వైఎస్సార్సీపీ హయాంలో ఆ పార్టీ నేతలు మత్తు నగరంగా మార్చేశారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాలతోపాటు ఏకంగా విశ్వవిద్యాలయాలకు ఈ గంజాయి మత్తు చేరింది. ఈ మత్తులో విస్తుగొలిపే ఘోరాలకు పాల్పడుతున్నారు. మహిళా వర్సిటీ న్యాయ విద్యార్థినిని గంజాయి మత్తుకు అలవాటు చేసి కృష్ణకిషోర్‌రెడ్డి అత్యాచారానికి పాల్పడిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గంజాయి మత్తును అనేక మంది యువతులకు కృష్ణకిషోర్‌రెడ్డి దంపతులు అలవాటు చేశారనే వార్త అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
ఊయలలో పసికందుపై లైంగికదాడి- విజయనగరం జిల్లాలో దారుణం - Rape on Six Months Baby