Kishan Reddy and Bandi Sanjay as a Central Ministers : దేశంలో బీజేపీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తరవాత మొదటిసారి మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న కిషన్ రెడ్డికి బొగ్గు గనులశాఖను కేటాయించగా, బండి సంజయ్‌కు హోంశాఖ సహాయ మంత్రిగా నియమించారు.
UNION CABINET 2024 Discussions : కేంద్ర మంత్రిమండలి ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో, ఇవాళ జరిగిన కేంద్రమంత్రుల శాఖల కేటాయింపులో చాలా వరకు సీనియర్ నేతలకు పాత శాఖలను ప్రధాని నరేంద్ర మోదీ ఖరారు చేశారు. కీలక శాఖలన్నీ బీజేపీ నేతలకే అప్పగించారు. మరోవైపు ఇవాళ జరిగిన కేంద్రమంత్రి వర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో కొత్తగా 3 కోట్లు ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే దిల్లీ లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో, మంత్రివర్గ సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన వారి కోసం, మొత్తం 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గత పదేళ్లలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 4కోట్ల 21లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది. వాటికి ప్రాథమిక మౌలిక వసతులు కల్పించినట్లు అధికారులు తెలిపారు.
Cabinet Minister Kishan Reddy about BJP New Govt : 2047లో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి, ప్రధాని మోదీ దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతులు, వ్యవసాయ రంగం అభివృద్ధికి కేంద్ర సర్కార్ కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఏ రాష్ట్రం పట్ల వివక్ష తమకు లేదని కిషన్‌రెడ్డి వెల్లడించారు. దేశంలో మౌలికవసతులు, ఉపాధి అవకాశాలు పెంచి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న సంకల్పంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు
Union Minister Bandi Sanjay on Telangana Development : రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యంగా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సహా అన్ని పార్టీల నేతలు అదే ఒరవడి కొనసాగించేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అందరూ కలిసి ముందుకెళ్తే అభివృద్ధి జరుగుతుందని, తెలంగాణ సర్కార్‌కు తన సంపూర్ణ సహకారం ఉంటుందని సంజయ్ వెల్లడించారు. ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలకు, కేంద్రమంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.