Justice PC Ghose Committee Inquiry Extended on Kaleshwaram : కాళేశ్వరంపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ న్యాయవిచారణ గడువును పొడిగించనున్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ ఏడోబ్లాక్ కుంగి పియర్స్, గేట్లు దెబ్బతినడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీలు సహా పలు సమస్యలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్‌తో న్యాయ విచారణ కమిషన్‌ను నియమించింది. 100 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి జూన్ వరకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. అయితే ఎన్నికల కోడ్ వంటి కారణాలతో ప్రభుత్వ ఉత్తర్వులు ఆలస్యంగా న్యాయమూర్తికి చేరడంతో పని ప్రారంభించడంలో జాప్యం జరిగింది.
50మంది విచారణ : విచారణ మొదలైనప్పటి నుంచి ఈ నెలాఖరు వరకు సుమారు 60 రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడం సహా బ్యారేజీల ఇంజినీర్లు, గతంలో ఆ పనుల్లో భాగస్వాములై ఉండి పదవీ విరమణ చేసినవారు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్- సీడీవో, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్ విభాగాలు, బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఇప్పటివరకు కమిషన్ విచారించింది. సుమారు 50 మందితో వేర్వేరుగా ముఖాముఖి మాట్లాడి పలు ప్రశ్నలు సంధించి వివరాలు సేకరించింది. వారందరినీ వ్యక్తిగతంగా అఫిడవిట్లు దాఖలు చేయమని కోరింది. ఈనెల 25వరకు గడువు ఇచ్చింది. మరో 50 మందిని ఇంకా విచారించాల్సి ఉన్నట్లు తెలిసింది.
అఫిడవిట్లు వచ్చిన తర్వాత వాటిని విశ్లేషించాల్సి ఉంది. వాటన్నిటికి సమయం పట్టే అవకాశం ఉందని విజిలెన్స్ నివేదికతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి చెందిన అన్ని ఫైళ్లను పరిశీలించాల్సి ఉన్నందున మరో రెండు నెలల పాటు గడువు పొడిగించనున్నట్లు సమాచారం. త్వరలోనే అందుకు సంబంధించిన ఆదేశాలు వెలువడతాయని నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు సీడీవో, హైడ్రాలజీ-ఇన్వెస్టిగేషన్ విభాగం ఇంజినీర్లు బుధవారం జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బ్యారేజీల్లో లోపాలకు కారణం ఏంటి, ఏకారణం చేత జరిగిందనుకొంటున్నారు, డిజైన్లలో లోపమా, డిజైన్ ప్రకారం నిర్మాణంలో లోపమా, నిర్వహణలోనా అంటూ పలు ప్రశ్నలు సంధించి వివరాలు కోరినట్లు తెలిసింది. షూటింగ్ వెలాసిటీ సమస్య, ఇసుక మేటవేయడం, ప్రతిఏడాది ఇసుక తొలగించాల్సి ఉన్నా అలా చేయకపోవడం తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే చర్యలు తప్పవు : మిషన్‌కు ఎవరు ఏం చెప్పినా ప్రతీది రికార్డు రూపంలో ఉండాలన్న జస్టిస్ ఘోష్ సరైన ఆధారాల కోసం అఫిడవిట్లు దాఖలు చేయమని చెబుతున్నట్లు వివరించారు. విజిలెన్స్, కాగ్ రిపోర్టులు ఉన్నాయి. వారిని పిలిచి వివరాలు తీసుకొంటామని చెప్పారు. తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే వారిపై చర్యలుంటాయని జస్టిస్ ఘోష్ స్పష్టం చేశారు.
విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ నిపుణుల కమిటీతో సమావేశం కానున్నారు. విచారణ ప్రక్రియలో భాగంగా, వివిధ విభాగాల నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ సీబీ కామేశ్వరరావు ఛైర్మన్‌గా ఏర్పాటైన కమిటీలో విశ్రాంత సీఈ సత్యనారాయణ, వరంగల్ నిట్ ప్రొఫెసర్ రమణమూర్తి, ఓయూ ప్రొఫెసర్ రాజశేఖర్ సభ్యులుగా ఈఎన్సీ అనిల్‌కుమార్ కన్వీనర్‌గా ఉన్నారు.
అధ్యయనంపై నిపుణులతో సమావేశం : ఆ కమిటీ ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను పరిశీలించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయడంతో పాటు లోపాలని పరిశీలించింది. మేడిగడ్డ ఆనకట్టలో పియర్స్ కుంగడం, ఇతర సమస్యలకు కారణాలతో పాటు అన్నారం, సుందిళ్ల వద్ద ఉత్పన్నమైన సమస్యలకు గల కారణాలపై వారు అధ్యయనం చేశారు. తమ పరిశీలన, అధ్యయనంలో వచ్చిన అంశాలను కమిటీ సభ్యులు జస్టిస్ పీసీ ఘోష్‌కు వివరించనున్నారు.