CM Jagan Delhi Tour: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చరు కొనసాగుతుండగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం పర్యటనపై ఓ ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలిసి వారితో భేటీ నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా, ఇతర హామీలపై చర్చించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ప్రధానితో సీఎం జగన్ భేటీ: దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ భేటీ సాగింది. ఈ భేటీలో సీఎం ప్రధానితో చర్చించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్ట్ నిధుల విడుదలపై చర్చించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. పోలవరం ప్రాజెక్ట్‌లో కాంపొనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేతకు, తొలివిడత పనులకు నిధులు విడుదల చేయాలని కోరినట్లు వెల్లడించింది.
సీఎం అభ్యర్థన మేరకు పోలవరం ప్రాజెక్టు కోసం 12వేల 911కోట్ల రూపాయల నిధుల విడుదలకూ కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించినట్లు ప్రకటించింది. ఈ నిధులకు కేబినెట్ ఆమోదం తెలిపేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కోరినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. పోలవరం మొదటి విడత పూర్తికి 17వేల 144 కోట్లు ఖర్చవుతుందని, ఈ ప్రతిపాదనను పరిశీలించి ఆమోదం తెలపాలని విన్నవించినట్లు తెలిపింది.
2014 సంవత్సరం జూన్ నుంచి మూడేళ్లపాటు తెలంగాణకు ఏపీ జెన్‌కో సరఫరా చేసిన విద్యుత్‌కు 7వేల 230 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించేలా చూడాలని కోరినట్లు పేర్కొంది. ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కేంద్రం అమలు చేయాలని సీఎం కోరినట్లు ప్రభుత్వం వివరించింది. కొత్తగా నిర్మిస్తున్న 17 మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం తోడ్పాటును అందించాలని కోరినట్లు ప్రకటించింది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విశాఖ నగరంతో అనుసంధానించేలా చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపింది. ఇందులో భాగంగా భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖ పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల రహదారికి సహకరించాలని విన్నవించినట్లు వివరించింది. విశాఖ – కర్నూలు హైస్పీడ్ కారిడార్‌ను కడప మీదుగా బెంగుళూరు వరకూ పొడిగించే ప్రాజెక్టు సాకారమయ్యేలా చూడాలని కేంద్రాన్ని కోరినట్లు వివరించారు. ఇందులో భాగంగా కడప – పులివెందుల – ముదిగుబ్బ – సత్యసాయి ప్రశాంతి నిలయం – హిందూపురం కొత్త రైల్వేలైన్ చేపట్టాలని సీఎం కోరినట్లు ప్రభుత్వం తెలిపింది. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని విన్నవించినట్లు వెల్లడించింది.