Prathidwani on Social Trolling And Suicides : ఒక్కక్షణం ఒకే ఒక్కక్షణంలో తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు ఎన్నో జీవితాల్ని తలకిందులు చేస్తున్నాయి. ఆత్మహత్య అన్న మాట వింటునే కాళ్లకింద భూమి కదిలిపోతోంది. అప్పటి వరకు, ఆ క్షణం ముందు వరకు మనతో, మన మధ్యనే ఉంటున్న వారు శాశ్వతంగా మన మధ్య నుంచి దూరమైపోయారనే మాటే కుటుంబాల్లో పిడుగుపాటు అవుతోంది. ప్రతి గంటకు 20 మంది వరకు నమోదవుతున్న బలవనర్మణాలు కన్నీటి చారికల తడి ఆరనివ్వడం లేదు. గాయాలు మానడం లేదు. కానీ ఎందుకీ విషాదం? సామాజిక మాధ్యమాల్లో ఎవరో ట్రోల్ చేశారనో, వేరేవరో ఏదో అన్నారనో విలువైన ప్రాణాలు తీసుకోవడం ఎంత వరకు సబబు? మోసపోయామనో, విఫలం అయ్యామనో, అనుకున్నది సాధించలేకపోయామనో జీవితాన్ని చాలిస్తే వాళ్ల మీదే ఆధారపడిన కుటుంబాలకు దిక్కెవరు? ఉన్నది ఒక్కటే జీవితమన్న విలువైన సందేశం ఎందుకు మరిచి పోతున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని
అసలే చదువుల ఒత్తిళ్లు. ఉరుకులు పరుగులు. ఇతరులతో సమానంగా ఎదగాలనే ఆశతో ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకుంటూ ఉంటారు. ఇటువంటి సమయంలో సోషల్ మీడియా ద్వారా ఎదురయ్యే విమర్శలు, ప్రతికూల వ్యాఖ్యలు ఎదుర్కోవడం మరో పెద్ద ఒత్తిడి అయిపోతోంది. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో పదోతరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన విద్యార్థినిని అభినందించడం మానేసి.. తన రూపురేఖలపై కొందరు చేసిన దుష్ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఎంతో కష్టపడి చదివి మొదటి ర్యాంకు తెచ్చుకున్న ఆ అమ్మాయి ఇటువంటి పరిస్థితులకు ఎంత తల్లడిల్లి ఉంటుంది? అయితే తాను ఇటువంటి వాటిని పట్టించుకోవడం లేదనీ, చదువు మీదే దృష్టిపెట్టాననీ నవ్వుతూ చెప్పేసింది. ఆమె ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని ఉంటే తన జీవితం ఏమయ్యేది? ప్రతీ ఒక్కరు ఇలా ఆలోచించి జీవితంలోని ఒడుదుడుకులను ఒకే విధంగా స్వీకరించి ధైర్యంగా ముందుకు సాగాలి.