తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచే నామపత్రాల స్వీకరణ

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల ప్రక్రియ ఊపందుకోనుంది. 17 లోక్​సభ స్థానాలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. వచ్చే నెల 11న పోలింగ్ జరగనుంది.

By

Published : Mar 18, 2019, 5:01 AM IST

Updated : Mar 18, 2019, 7:17 AM IST

నేటి నుంచే నామినేషన్ల పర్వం

నేటి నుంచే నామినేషన్ల పర్వం
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 17 లోక్​సభ స్థానాలకు తొలిదశలోనే పోలింగ్​ జరగనుంది. ఇందుకు అనుగుణంగా భారత ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. పార్లమెంట్​ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటి నుంచే ప్రారంభం కానుంది. నేడు ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారులు స్థానికంగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. ప్రకటన వెలువడినప్పటి నుంచి నామపత్రాల స్వీకరణ ఉంటుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు తుది గడువు. 21న హోలీ, 24న ఆదివారం అయినందున ఈ రెండు రోజుల్లో నామపత్రాలు స్వీకరించబోరు. 26న నామపత్రాల పరిశీలన, 28 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదే రోజు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. వచ్చే నెల 11న పోలింగ్​ జరగనుంది.

పూర్తి వివరాలు ఇవ్వాల్సిందే..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్​తో పాటు ఈసీ నిర్ధారిత నమునాలో అఫిడవిట్​ను పొందుపర్చాల్సి ఉంటుంది. అందులో అభ్యర్థి వివరాలను పూర్తిగా పేర్కొనాలి. విద్యార్హతలు, సామాజిక మాధ్యమాల ఖాతాలతో పాటు నేర చరిత్ర, కేసుల వివరాలను పొందుపర్చాలి. అభ్యర్థులు వారి కుటుంబసభ్యుల ఆస్తుల, అప్పుల వివరాలను తెలియజేయాలి.

విదేశాల్లో ఉన్న ఆస్తులు కూడా...
అఫిడవిట్​కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఈ మారు కొత్త అంశాన్ని కూడా చేర్చింది. అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులకు విదేశాల్లో ఏవైనా ఆస్తులు ఉంటే వాటిని కూడా ప్రమాణపత్రంలో పొందుపర్చాలని స్పష్టం చేసింది. అఫిడవిట్​లో పేర్కొన్న నేరచరిత్ర, కేసుల వివరాలను అభ్యర్థులు మూడు మార్లు పత్రికలు, టీవీల్లో ప్రకటించాల్సి ఉంటుంది. అందుకు అయ్యే వ్యయాన్ని కూడా అభ్యర్థుల ఎన్నికల ఖర్చుగానే పరిగణిస్తారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్​ అధికారులకు శిక్షణా కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేసింది ఈసీ.

ఇవీ చూడండి: అవసరమైతే జాతీయపార్టీ పెడతా...: కేసీఆర్​

Last Updated : Mar 18, 2019, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details