తెలంగాణ

telangana

ETV Bharat / state

Akbaruddin in Assembly: 'పాతబస్తీని ఇస్తాంబుల్‌గా ఎప్పుడు చేస్తారో చెప్పండి'​

Akbaruddin in Assembly: ఉద్యోగ నియామకాలపై ప్రకటన చేసిన సీఎం కేసీఆర్​కు అసెంబ్లీ వేదికగా.. మజ్లిస్​ నేత అక్బరుద్దీన్​ ఓవైసీ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చాలని డిమాండ్​ చేశారు. మైనార్టీల ఖర్చుపై ప్రభుత్వ గణాంకాలు, వాస్తవాలకు పొంతన లేదని.. బడ్జెట్​పై శాసనసభలో జరిగిన సాధారణ చర్చలో అక్బరుద్దీన్​ విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల పనిదినాలు తగ్గిపోయాయని ఆరోపించారు.

By

Published : Mar 9, 2022, 5:17 PM IST

Akbaruddin on Job Notifications
అసెంబ్లీలో అక్బరుద్దీన్​

Akbaruddin in Assembly: మైనార్టీల ఖర్చుపై ప్రభుత్వ లెక్కలు, వాస్తవాలకు పొంతన లేదని మజ్లిస్‌ సభాపక్ష నేత అక్బరుద్దీన్‌ అసెంబ్లీలో గళమెత్తారు. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి ఏ ఒక్క పేదవాడికైనా రుణం మంజూరైందా అని హోంమంత్రి మహమూద్‌ అలీని నిలదీశారు. బడ్జెట్‌పై శాసనసభలో సాధారణ చర్చపై మాట్లాడిన అక్బరుద్దీన్.. ఉద్యోగ నియామకాలపై ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు. సభలో నిబంధనలు ఉల్లంఘించిన సభ్యులను సస్పెండ్ చేస్తున్నారన్న అక్బరుద్దీన్‌.. హామీని నెరవేర్చని ప్రభుత్వాన్ని ఏం చేయాలని? ప్రశ్నించారు. ఉద్యోగ నియామకాల హామీ కూడా ఇలాగే ఉంటుందా అని అనుమానం వ్యక్తం చేశారు.

"మైనార్టీల ఖర్చుపై ప్రభుత్వ లెక్కలు, వాస్తవాలకు పొంతన లేదు. సభలో మాకిచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎందుకు మాటిస్తారు.? సభలో నిబంధనలు ఉల్లంఘించిన సభ్యులను సస్పెండ్ చేస్తున్నారు. సభలో ఇచ్చిన హామీని నెరవేర్చని ప్రభుత్వాన్ని ఏమి చేయాలి.? ఉద్యోగ నియామకాల హామీ కూడా ఇలాగే ఉంటుందా.?" -అక్బరుద్దీన్​ ఓవైసీ, మజ్లిస్​ సభాపక్ష నేత

హామీలే తప్ప ఆచరణ లేదు

పాతబస్తీకి మెట్రో కనెక్టివిటీని స్వాగతించిన అక్బరుద్దీన్.. ఎంఎంటీఎస్​ ఫేజ్-2కు కేటాయింపులు లేవని.. ఆరోపించారు. పాతబస్తీని ఇస్తాంబుల్‌గా ఎప్పుడు చేస్తారో చెప్పాలని డిమాండ్​ చేశారు. వక్ఫ్ భూముల విషయంలో తెరాస వైఖరి సరిగా లేదని విమర్శించారు. నాలాల సమస్యపై సమావేశానికి పిలుస్తామని కేటీఆర్​ అసెంబ్లీలో ప్రకటించారని అక్బరుద్దీన్​ గుర్తుచేశారు. అన్ని పండుగలు అయిపోతున్నా ఆ ఊసే మరిచారని ఎద్దేవా చేశారు. ఉస్మానియా ఆసుపత్రిని పునరుద్ధరించాలని కోరారు. హమీలే తప్ప ఆచరణేదని.. ప్రకటనలే తప్ప పనులేవని ప్రభుత్వాన్ని అక్బరుద్దీన్​ నిలదీశారు.

ప్రశంసిస్తాం.. ప్రశ్నిస్తాం..

"తెరాసకు మేము మిత్రపక్షం. మంచి చేస్తే ప్రశంసిస్తాం, చేయకపోతే ప్రశ్నిస్తాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలి. తెరాస, మజ్లిస్‌పార్టీలు మళ్లీ గెలుస్తాయి. బంగారు తెలంగాణ నిర్మిద్దాం." -అక్బరుద్దీన్‌, మజ్లిస్‌సభాపక్ష నేత

మైనార్టీల ఖర్చుపై ప్రభుత్వ లెక్కలు, వాస్తవాలకు పొంతన లేదు: అక్బరుద్దీన్‌

ఇదీ చదవండి:సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.... రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

ABOUT THE AUTHOR

...view details