అబ్దుల్ కరీం టుండాను నిర్దోషిగా తేల్చిన నాంపల్లి కోర్టు
19:07 March 03
అబ్దుల్ కరీం టుండాను నిర్దోషిగా తేల్చిన నాంపల్లి కోర్టు
హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్రపన్నిన కేసులో నిందితుడిగా ఉన్న అబ్దుల్ కరీం టుండాను నాంపల్లి న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులో పోలీసులు సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. 1998లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిదా దేశంలోని పలు చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నింది. హైదరాబాద్‌లోనూ హుమాయున్ నగర్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అబిడ్స్, ఎంజే మార్కెట్లో పేలుళ్లకు కుట్ర పన్నారు.
ఢాకాలో శిక్షణ
పాకిస్థాన్‌కు చెందిన సలీం జునేద్ పేలుళ్ల కోసం నగరానికి వచ్చి మల్లేపల్లికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం హైదరాబాద్‌తో పాటు... ముంబయిలోనూ పాస్‌పోర్టు తీసుకున్నాడు. సలీం జునేద్తో పాటు... నగరానికి చెందిన అబ్దుల్ ఖయూమ్ 1996లో ఢాకా వెళ్లి ఉగ్రశిక్షణ పొందారు. వీళ్లకు అబ్దుల్ కరీం టుండా... పేలుళ్లలో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా ప్రోత్సహించాడు. సలీం జునేద్తో పాటు... అబ్దుల్ ఖయూమ్ 1998లో నగరానికి చేరుకొని పేలుళ్లకు కుట్రపన్నారు.
ఆధారాలు సమర్పించకపోవడంతో...
ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న సలీం జునేద్తో పాటు... మరో కొంతమందిని నాంపల్లి న్యాయస్థానం దోషులుగా తేల్చింది. పేలుళ్లకు కుట్రపన్నిన కేసులో నిందితుడిగా ఉన్న టుండా పాకిస్థాన్‌లో తలదాచుకున్నాడు. 2013 ఆగస్టులో నేపాల్ సరిహద్దులో కరీం టుండా పట్టుబడిన తర్వాత... నగర పోలీసులు 2014లో కస్టడీలోకి తీసుకొని నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఆరేళ్ల పాటు న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. టుండా ప్రమేయంపై సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. ఘజియాబాద్‌లో పేలుళ్లకు కుట్రపన్నిన కేసులో టుండా ఘజియాబాద్ జైలులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.