తమ అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్, టీమ్ఇండియా ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ. వీరు క్రీజులో ఉంటే ప్రతి అభిమాని మ్యాచ్లో లీనమైపోతారు. క్లాస్ షాట్లతో ప్రత్యర్థి జట్లపై పూర్తి ఆధిపత్యం వహించే వీరిద్దరూ అప్పుడప్పుడు తమ బౌలింగ్‌తోనూ అలరించారు. కొందరు ప్రముఖ బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేశారు. అలా సచిన్, కోహ్లీ బౌలింగ్‌లో ఔటైన ఆ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
కెవిన్ పీటర్సన్ (ఇంగ్లాండ్)
దిగ్గజ క్రికెటర్, ఇంగ్లాండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్.. తన ఆటతో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంగ్లీష్ జట్టుకు సారథ్యం వహించి ఎన్నో విజయాలనందించాడు. బ్యాట్‌తోనూ మెరుగ్గా రాణించాడు. అయితే ఇతడు సచిన్, కోహ్లీ ఇద్దరి బౌలింగ్లనూ ఔటయ్యాడు. మాస్టర్ ఇతడిని టెస్టుల్లో ఔట్ చేయగా.. కోహ్లీ టీ20ల్లో తను వేసిన తొలి బంతికే ఇతడిని పెవిలియన్ చేర్చాడు.
2007 ఆగస్టులో భారత్.. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ సిరీస్ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సచిన్.. పీటర్స్‌ను బోల్తా కొట్టించాడు. మాస్టర్ వేసిన బంతిని షాట్ ఆడబోయిన ఇతడు స్లిప్‌లో ద్రవిడ్‌కు క్యాచ్ ఇచ్చి 41 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగాడు. ఇందులో సచిన్ 26 ఓవర్లు వేయగా ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
2011 ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యనటకు వెళ్లిన భారత్.. మాంచెస్టర్ వేదికగా ఏకైక టీ20 ఆడింది. ఈ ఫార్మాట్లో తొలి ఓవర్ వేసిన కోహ్లీ.. మొదటి బంతికే పీటర్సన్‌ను పెవిలియన్ చేర్చాడు. విరాట్ వేసిన వైడ్ డెలివరీని ముందుకొచ్చి ఆడబోగా ధోనీ స్టంపౌట్ చేశాడు. ఈ మ్యాచ్లో మూడు ఓవర్లు వేసిన విరాట్.. ఒకే వికెట్ తీశారు. 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మహ్మద్ హఫీజ్, (పాకిస్థాన్)
సచిన్, కోహ్లీకి దొరికిపోయిన మరో క్రికెటర్ మహ్మద్ హఫీజ్. మాస్టర్ ఇతడిని వన్డేలో ఔట్ చేయగా.. విరాట్ టీ20ల్లో ఇతడిని పెవిలియన్ చేర్చాడు.
2005 ఏప్రిల్లో భారత పర్యటనకు వచ్చిన పాకిస్థాన్.. తొలి వన్డేను కోచి వేదికగా ఆడింది. ఈ మ్యాచ్లో ఆరో బ్యాట్స్‌మన్‌గా వచ్చిన హఫీజ్‌ను మాస్టర్ ఔట్ చేశాడు. 42 పరగుల వ్యక్తిగత స్కోరు వద్ద నెహ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇది ఈ మ్యాచ్లో మాస్టర్‌కు ఐదో వికెట్. మొత్తంగా ఐదు వికెట్లతో సచిన్ రెచ్చిపోగా.. పాక్‌ను 87 పరుగుల తేడాతో మట్టికరిపించింది భారత్. సచిన్ హఫీజ్‌తో పాటు ఇంజమామ్ ఉల్ హక్, అబ్దుల్ రజాక్, షాహిద్ అఫ్రిదీ, మహ్మద్ సమీ వికెట్లను దక్కించుకున్నాడు.
2012 టీ20 ప్రపంచకప్‌లో కొలంబోలో(శ్రీలంక) జరిగిన గ్రూప్ మ్యాచ్లో హఫీజ్‌ను తన బంతితో బోల్తా కొట్టించాడు కోహ్లీ. ఓపెనర్‌గా వచ్చిన హఫీజ్.. 15 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో పాక్ 128 పరుగుల చేయగా భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
బ్రెండన్ మెక్‌కలమ్ (న్యూజిలాండ్)
సచిన్, మాస్టర్ వలలో పడిన మరో క్రికెటర్ బ్రెండన్ మెక్‌కలమ్. ఇతడిని టెస్టులో సచిన్, వన్డేలో కోహ్లీ ఔట్ చేశారు.
2009 ఏప్రిల్లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత్.. వెల్లింగ్టన్ వేదికగా మూడో టెస్టు ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగుల వద్ద సచిన్ లెగ్ బ్రేక్‌కు బలయ్యాడు మెక్‌కలమ్. ఇదే ఇన్నింగ్స్‌లో జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను కూడా ఔట్ చేశాడు మాస్టర్. కానీ మ్యాచ్‌ను మాత్రం గెలిపించలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో 617 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 8 వికెట్ల నష్టానికి 281 పరుగులు మాత్రమే చేసి ఓటమి అంచున నిలిచింది. కానీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసి కివీస్‌కు ఊరటనిచ్చింది.
2014 జనవరిలో న్యూజిలాండ్ పర్యనటలో టీమ్ఇండియా వెల్లింగ్టన్ వేదికగా ఐదో వన్డే ఆడింది. ఈ మ్యాచ్లో మెక్‌కలమ్ కివీస్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇతడిని పెవిలియన్ చేర్చాడు కోహ్లీ. కవర్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్‌కు చిక్కి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్లో 7 ఓవర్లు వేసిన విరాట్ 36 పరుగులు సమర్పించుకున్నాడు. తర్వాత బ్యాటింగ్‌లోనూ 87 పరుగులతో సత్తాచాటినా జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్లో 87 పరుగుల తేడాతో ఓటమిపాలైంది టీమ్ఇండియా.
మొత్తంగా సచిన్ తెందుల్కర్ తన కెరీర్లో టెస్టుల్లో 46, వన్డేల్లో 154, టీ20ల్లో ఓ వికెట్ కలిపి 201 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లీ మాత్రం తన అంతర్జాతీయ కెరీర్లో వన్డేల్లో 4, టీ20ల్లో 4 వికెట్లతో మొత్తం 8 మందిని ఔట్ చేశాడు.