వైరస్ నిఫా.. దాని బారిన పడిన వారిలో 75 శాతం మంది ప్రాణాలను హరించి వేస్తుంది. ఈ వైరస్ సోకి 2018లో కేరళలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. గబ్బిలాల్లో కనిపించే ఈ వైరస్.. మానవులకు ఎలా సోకుతుందనేది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉండిపోయింది. అయితే.. తాజాగా ఓ అధ్యయనం మానవులకు ఎలా సోకుంతుదనే అంశాన్ని వెల్లడించింది.
ఆరేళ్ల పాటు సాగిన ఈ అధ్యయనం.. నిఫా వైరస్ గబ్బిలాల మధ్య ఏ విధంగా వ్యాప్తి చెందుతుందనే అంశాన్ని వెల్లడించింది. మానవుల్లో ఈ వైరస్ ఎప్పుడు విజృంభిస్తుందో అంచనా వేసేందుకు ఈ అధ్యయనం సాయపడనుంది.
ఈ పరిశోధన పీఎన్ఏఎస్ జర్నల్లో ప్రచురితమైంది.
" మానవుల్లో వ్యాప్తిని అడ్డుకునేందుకు.. గబ్బిలాలలో ఈ వైరస్ ఎప్పుడు వ్యాపిస్తుందో తెలుసుకోవాలి. ఈ అధ్యయనం గబ్బిలాలలో నిఫా సంక్రమణ నమూనాల గురించి లోతైన అవగాహనను అందిస్తుంది. కేరళ, బంగ్లాదేశ్లలో గతంలో నిర్వహించిన పరిశోధనల ప్రకారం.. భారతీయ గబ్బిలాలు ఈ నిఫా వైరస్ను వ్యాప్తి చేస్తాయని తేలింది. ఏడాదిలో ఏ సమయంలోనైనా గబ్బిలాలు, మానవుల మధ్య సంబంధం ఏర్పడిన క్రమంలో వైరస్ మానవులకు సోకుతుందని సైద్ధాంతికంగా రుజువైంది. పండ్ల చెట్లల్లో పరపరాగ సంపర్కానికి గబ్బిలాలు చాలా ముఖ్యం. కాబట్టి వాటిని వదిలించుకోవటం సరికాదు. వైరస్ వ్యాప్తి మార్గాలను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. అవి మన ఆహారం, నీటిని కలుషితం చేయకుండా చూసుకోవాలి."
- జోనాథన్ ఎప్స్టీన్, రచయిత, పరిశోధకుడు.
భారత్లోని అన్ని ప్రాంతాల్లో గబ్బిలాలు ఉంటాయి. గ్రామాల్లో పెద్ద పెద్ద వృక్షాల్లో వేలాది గబ్బిలాలు ఆవాసం ఏర్పరచుకుంటాయి. అయితే.. వాటి సంఖ్య, అవి ఎంత ప్రాంతంలో విస్తరించి ఉన్నాయనేది ముఖ్యమని తెలిపారు ఎప్స్టీన్. అయితే.. గబ్బిలాలను తరిమికొట్టటం ఈ సమస్యకు పరిష్కారం కాదని హెచ్చరించారు. అలా చేయటం ద్వారా ఇతర ప్రాంతంలోని వాటికి వైరస్ సోకి వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తెలిపారు.
గబ్బిలాల్లో ఈ వైరస్ విజృంభించినప్పుడు.. వాటి మూత్రం, ఇతర శరీర ద్రవాల్లో వైరస్ చేరి బయటకు వస్తుందని తెలిపారు ఎప్స్టీన్.వాటి ద్వారా మానవులకు సోకేందుకు వీలు కలుగుతుందని వెల్లడించారు. ప్రధానంగా చాలా సందర్భాల్లో వైరస్ సోకిన గబ్బిలాలు తాకిన పండ్ల ద్వారానే మానవులకు ఈ వైరస్ వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. గబ్బిలాల పంటి గాట్లు ఉన్న పండ్లను తీసుకోకపోవటం, వాటిని సరఫరా చేయకపోవటంతో చాలా వరకు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపారు.
70 శాతం గబ్బిలాల్లో యాంటీబాడీలు..
గబ్బిలాల జాతిలో 60 నుంచి 70 శాతం వరకు నిఫా వైరస్ యాంటీబాడీలను కలిగి ఉంటాయని తెలిపారు శాస్త్రవేత్తలు. అయితే..అవి కొన్ని రోజుల తర్వాత తగ్గిపోవటం వల్ల వైరస్ విజృంభిస్తుందని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్లో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గబ్బిలాల్లో ఈ వైరస్ విజృంభిస్తున్నట్లు పలు పరిశోధనలు వెల్లడించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అది.. నిఫా వైరస్ సంక్రమణ కాలాన్ని అర్థం చేసుకునేందుకు చాలా కీలకమైనదిగా పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మృత్యు వైరస్ 'నిఫా' మళ్లీ వస్తుందా...?