వరుస ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి - kanakadurgamma news
Indrakeeladri: బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధి వరుస ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే పవిత్ర సారె మొదలుకొని.. తెలంగాణ నుంచి ఉమ్మడి దేవాలయాల కమిటీ దుర్గమ్మ సన్నిధికి తీసుకొచ్చే బంగారు బోనం సమర్పణ, ఆ తర్వాత శాకంబరీదేవి ఉత్సవాల కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది భక్తుల రద్దీ పెరుగుతుందనే అంచనాతో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఈ నెల 30 నుంచి జులై 28 వరకు పవిత్ర ఆషాడ సారె కార్యక్రమం నిర్వహించనున్నారు. గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా ఆంక్షల మధ్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసారి మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో సారె సమర్పణకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని ధార్మిక సంస్థలు, భజన మండళ్లకు సమాచారం పంపారు. సారె సమర్పణకు బృందాలుగా తరలివచ్చే వారంతా మూడు రోజుల ముందు శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు.