ఘనంగా రైతుల పండుగ.. మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా పొలాలకు
ఏరువాక అంటే రైతులకు పండుగ.. అలాంటి పండుగను కర్షకులు ఘనంగా జరుపుకున్నారు. పలు ప్రాంతాల్లో రైతులు ఎడ్లను కడిగి, కొమ్ములకు రంగుల్ని పూసి, కాళ్లకు గజ్జెలు కట్టి మెడలో గంటల్ని అలంకరించారు. ఎడ్లను కట్టే కాడిని పసుపు కుంకుమలు, పుష్పమాలికలతో తీర్చిదిద్దారు. ఎడ్లకు పాలపొంగలిని ఆహారంగా సమర్పించారు. గ్రామంలోని రైతులంతా మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా పొలాలకు తరలివెళ్ళి దుక్కి దున్నడం ప్రారంభించారు. గోగునారతో రక్షల్ని తయారుచేసి, పశుసంపద వృద్ధి చెందాలని కోరుకుంటూ పశువుల మెడలో గవ్వలు, నల్లపూసలతో కలిపి దండగా వేశారు. ప్రకృతిని భక్తిశ్రద్ధలతో పూజించడానికి, తమ పురోగతికి ఉపకరించే పశుగణాన్ని సమాదరించడానికి రైతులు ఏరువాక పున్నమిని ఘనంగా జరుపుకుంటారు.