సర్పంచుల సమస్యలపై జనవరి 1 నుంచి ప్రభుత్వంపై సమర శంఖం: వైవీబీ రాజేంద్రప్రసాద్ - పంచాయతీ రాజ్ ఛాంబర్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 24, 2023, 5:02 PM IST
YVB Rajendra Prasad on Village Secretariat: గ్రామ సచివాలయాల్ని పంచాయతీల్లో విలీనం చేయాలని పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. వాలంటీర్లకు 5 వేల వేతనమిస్తూ సర్పంచ్‌లకు కేవలం 3 వేల రూపాయలు ఇవ్వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా తక్కువగా గౌరవ వేతనాలు అందించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు 15వేల రూపాయల గౌరవ వేతనం అందించాలని విజ్ఞప్తి చేశారు. నిధుల మళ్లింపు, సర్పంచుల సమస్యలపై జనవరి 1 నుంచి ప్రభుత్వంపై సమర శంఖం పూరించనున్నట్లు ఆయన ప్రకటించారు.
పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 8వేల కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు చేయాల్సిన పనులను, వాలంటీర్లు, గృహ సారథులతో చేయించడం తగదన్నారు. గ్రామ వాలంటీర్లను, సచివాలయాలను తీసుకువచ్చి గ్రామ పంచాయతిల్లో కలపాలన్నారు. గ్రామ వాలంటీర్లను సర్పంచ్ల ఆధ్వర్యంలోనే పని చేయించాలని డిమాండ్ చేశారు.