షర్మిల కాంగ్రెస్‌లో చేరితే మాకేం నష్టం లేదు : వైవీ సుబ్బారెడ్డి - వైఎస్సార్సీపీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2024, 5:26 PM IST
YV Subba Reddy Comments on Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ఆంశంపై, వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అంతేకాకుండా రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుపై కూడా ఆయన స్పందించారు. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని, విజయాన్ని సాధించడానికే తాము మార్పులు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రలో కూడా మార్పులు చేర్పులకు అవకాశం ఉందని ఆయన తెలిపారు.
షర్మిల కాంగ్రెస్‌లో చేరితే తమకేం నష్టం లేదని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యనించారు. విజయమ్మతో భేటీలో కుటుంబ విషయాలే చర్చిస్తున్నానని, రాయబారాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. జగన్‌ను ప్రత్యక్షంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీ గెలుపును ఆపలేరని అభిప్రాయం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్న చోట, గెలుపు అవకాశాలు తక్కువ ఉన్న చోటే అభ్యర్థుల మార్పులు - చేర్పులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.