'లోకేశ్‌ను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని తెలుసు - రాష్ట్ర భవిష్యత్ కోసం ఆయనకు రక్షణగా నిలబడ్డాం'
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 1:00 PM IST
Yuvagalam Volunteer Team Comments: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నిన్న (సోమవారం) దిగ్విజయంగా పూర్తయిన విషయం తెలిసిందే. యువగళం పాదయాత్ర సాఫీగా సాగడానికి వాలంటీర్ వ్యవస్థ ఎంతో కృషి చేసింది. ప్రధానంగా రోప్ పార్టీ సమన్వయం, వినతుల స్వీకరణ, కరపత్రాల పంపిణీ, లోకేశ్ క్యాంప్ సైట్‌లో బస్సు ఎక్కే వరకు ఎక్కడా ఏ సమస్య రాకుండా వెన్నుదన్నుగా నిలిచింది. అంతేకాకుండా, పాదయాత్రలో సాగే బృందానికి వసతి, ఆహారం, ఇతర సదుపాయాలు, క్యాంప్ సైట్ ఏర్పాటు వంటి పనులను పర్యవేక్షించింది. వాలంటీర్లు వివిధ బృందాలుగా ఏర్పడి కలిసికట్టుగా పని చేసి, యువగళం పాదయాత్రను జైత్ర యాత్రలా మలిచారు.
Volunteers on Yuvagalam Padayatra: ''మేమంతా యువనేత లోకేశ్ గారి అభిమానులం, టీడీపీ కార్యకర్తలం. రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత కోసం పాదయాత్ర చేపట్టాలని ఏరోజైతే ఆయన నిర్ణయించారో, ఆరోజే మేము కూడా ఆయనకు రక్షణగా నిలబడాలని నిర్ణయించుకున్నాం. పాదయాత్ర మొదలుకొని నిన్నటి వరకూ అన్ని విధాలుగా మా వంతు కృషి చేశాం. పాదయాత్రను అడ్డుకోవాలని వైఎస్ జగన్ ప్రభుత్వం, పోలీసులు, వైసీపీ నేతలు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వారి వల్ల కాలేదు. కిలారి రాజేష్ గారి ఆదేశాలతో మేమంతా లోకేశ్‌కు రక్షణగా, వాలంటీర్లుగా, దృఢమైన సైన్యంగా పనిచేశాం. మమ్మల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి, ఒక రాత్రంతా నానా ఇబ్బందులు పెట్టారు. అయినా మేము భయపడకుండా యువగళం కోసం పనిచేశాం. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రోప్ పార్టీ సమన్వయం మొదలుకొని వినతుల స్వీకరణ, లోకేశ్ గారు క్యాంప్ సైట్‌లో బస్ ఎక్కే వరకు ఎక్కడా ఏ సమస్య రాకుండా వెన్నుదన్నుగా నిలిచాం. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన పార్టీ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.'' అని యువగళం వాలంటీర్లు వారి స్పందనను తెలిపారు.