ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలుపై బీజేపీ నిలువునా మోసం చేసింది: పేరుపొగు వెంకటేశ్వరరావు - విజయవాడలో సమావేశం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 4, 2024, 10:35 PM IST
Yuddabheri Mahasabha Meeting in Vijayawada: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో యుద్దభేరి మహాసభ సన్నాహాక సమావేశం విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపొగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా మాజాతికి న్యాయం జరగడం లేదన్నారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున వేలాదిమందితో జనవరి 31వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించబోతున్నామని ఆయన తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న మాదిగ పెద్దలను ఆహ్వానిస్తున్నామన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగ ఉపకులాలకు సామాజిక న్యాయం చేస్తామని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చి 10సంవత్సరాలు గడుస్తున్నా, పార్లమెంటులో ఎక్కువ మెజార్టీ ఉన్నప్పటికీ కూడా మోదీ ప్రభుత్వం బిల్లు పెట్టి చట్ట భద్రత కల్పించకపోవటం అనేది మాదిగలను విస్మరించడమన్నారు. మంద కృష్ణ ప్యాకేజీ స్టార్‌గా మారి బీజేపీకీ అమ్ముడుపోయాడని మండిపడ్డారు. మాదిగలకు వర్గీకరణ బిల్లు అమలు చేస్తానని హామీనిచ్చి కనీసం పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణపై చర్చకు తీసుకు రాకపోవడం మాదిగలను నిలువునా మోసం చేసినట్లేనని వెంకటేశ్వరరావు అన్నారు.