YSRCP Wide Meeting Jagan with Party Members: నేడు వైసీపీ విస్తృతస్థాయి సమావేశం.. - వైసీపీ విస్తృతస్థాయి సమావేశం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 26, 2023, 10:46 AM IST
YSRCP Wide Meeting Jagan with Party Members: ఎన్నికలకు సిద్ధమవడమే ఎజెండాగా ఆ పార్టీ అధినేత జగన్ నేడు.. వైసీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించే ఈ సమావేశానికి.. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, అన్ని జిల్లాల అధ్యక్షులు, జగనన్న గృహ సారథుల సమన్వయకర్తలు హాజరుకానున్నారు. ఈ భేటీలో రాబోయే ఎన్నికలకు కార్యాచరణను జగన్ ప్రకటించనున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించి 16 నెలలైనా, మధ్యలో హెచ్చరించినా పూర్తిస్థాయిలో పాల్గొనని ఎమ్మెల్యేల భవితవ్యంపైనా.. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టతనిస్తారని చెబుతున్నారు.
గడప గడపకు కార్యక్రమం ముగింపు సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు ఎజెండా ప్రకటించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా ఈ సభల్లో మాట్లాడాలని.. మరోవైపు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించడానికీ వీటిని వినియోగించుకునేలా కార్యాచరణ ప్రకటించనున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో ఎమ్మెల్యేలు విధిగా పాల్గొనేలా రూపొందించిన ప్రణాళికను వెల్లడిస్తారని సమాచారం.