తుస్సుమన్న సామాజిక సాధికార యాత్ర- సభ ప్రారంభంలోనే వైదొలిగిన ప్రజలు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 13, 2023, 7:14 AM IST
YSRCP Samajika Sadhikara Yatra Is Failed In Anakapalli District: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం వడ్డాదిలో అధికార వైఎస్సార్సీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర తుస్సుమంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భారీగా జనసమీకరణ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సభ జరుగుతుండగానే జనం అక్కడ నుంచి బయటకు వెళ్లిపోయారు. వారిని ఆపేందుకు వైఎస్సార్సీపీ నేతలు నానా తంటాలు పడ్డారు. ఆటోల్లో వచ్చిన జనం వచ్చినట్లే తిరుగు ఆటోలో వెళ్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిస్టరీ కమిటీ సభ్యుడు, వైస్ ప్రెసిడెంట్, సర్పంచ్ తదితరులు జనం అక్కడ నుంచి వెళ్లకుండా ఆటోలను అడ్డుకున్నారు.
మరోవైపు పోలీసుల ఆంక్షలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిపివేయడంతో ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు వీలులేకపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. సభ జరిగే ప్రాంతం నుంచి మహిళలు సభ ప్రారంభంలోనే వెనుతిరగటంతో సామాజిక సాధికార యాత్ర తుస్సుమనటంతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.