YSRCP MPP attacked by MLA followers: చనిపోయే వరకూ న్యాయం జరగదా..! జడ్పీ సమావేశంలో వైసీపీ ఎంపీపీ - YSRCP MPP Rajyalakshmi Comments
YSRCP MPP Rajyalakshmi Comments: తమ కుటుంబంపై దాడి చేసిన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ అనుచరులపై ఇప్పటివరకూ ప్రభుత్వం గానీ, అధికారులు గానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. రౌతులపూడి ఎంపీపీ రాజ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌లో జరిగిన సమావేశంలో మంత్రులు దాడిశెట్టి రాజా, వేణుగోపాలకృష్ణ, జిల్లా పరిషత్ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ దృష్టికి దాడి విషయాన్ని తీసుకొచ్చారు. అనంతరం బయటకు రావాలంటేనే భయపడాల్సి వస్తోందని.. తమ కుటుంబాన్ని చంపేస్తామని భయపెడుతున్నారని కన్నీరుమున్నీరైంది. దాడి జరిగి నెల రోజులు దాటినా.. వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన చెెందింది.
దయచేసి నా కుటుంబానికి ప్రాణ రక్షణ కల్పించండి.. మీడియాతో రౌతులపూడి ఎంపీపీ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ..''నేను రౌతులపూడి ఎంపీపీగా విధులు నిర్వర్తిస్తున్నాను. జూన్ 13వ తేదీన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ అనుచరులు మా ఇంటిమీదికి వచ్చి దౌర్జన్యంగా దాడి చేసి కొట్టారు. ఈ ఘటన జరిగి నెల రోజులు అవుతుంది. ఇప్పటివరకూ పోలీసులు గానీ, అధికారులు గానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ విషయంపై ఈరోజు జడ్పీ సమావేశంలో అధికారుల ముందు ప్రస్తావించాను. బయటకు రావాలంటేనే భయపడాల్సి వస్తోంది. వాళ్లు మా కుటుంబాన్ని చంపేస్తామంటూ పదే పదే భయపెడుతున్నారు. నా కుటుంబం చనిపోయేవరకూ నాకు న్యాయం జరగదని అనుకుంటున్నాను. మమ్మల్ని బెదిరిస్తున్నవారిని రిమాండ్‌కు పంపించి నాకు, నా కుటుంబానికి ప్రాణ రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను'' అని ఆమె అన్నారు.