టీడీపీ, జనసేనపై ఎన్నికల సంఘానికి విజయసాయి రెడ్డి ఫిర్యాదు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 9, 2024, 3:26 PM IST
YSRCP MP Vijayasai Reddy Complains On TDP: గుర్తింపు లేని జనసేన పార్టీ ఎన్నికల కమిషన్ను కలిసి ఎలా ఫిర్యాదు చేయగలిగిందంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. తెలుగుదేశం మిత్రపక్ష పార్టీగా కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసిందని, ఆ పార్టీ బీజేపీతో అలయెన్స్ పార్టీనా లేక టీడీపీకా అనే అంశంపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు ఎంపీ తెలిపారు. గ్లాస్ గుర్తు సాధారణ సింబల్ కానీ దాన్ని జనసేనకు ఎలా కేటాయించారని ప్రశ్నించామని చెప్పారు. మొత్తం ఆరు అంశాలపై ఎన్నికల కమిషన్ కు విజ్ఞాపన ఇచ్చినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు.
టీడీపీలో ఒకరు గంపగుత్తగా బోగస్ ఓట్లపై ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారని, ఏపీ సీఈఓ ఆ ఫిర్యాదును ఎలా తీసుకుంటారని నిలదీశారు. వాటిని కలెక్టర్లకు, బీఎల్ఓలకు ఎలా పంపుతారన్నారు. ఇదంతా ఓ కుట్ర ప్రకారం జరుగుతోందని ఆరోపించారు. టీడీపీ ఉద్దేశ్యపూర్వకంగానే వైఎస్సార్సీపీ ఓట్లను టార్గెట్ చేస్తూ ఫిర్యాదులు ఇస్తోందని విమర్శించారు. బల్క్ ఫిర్యాదులు, బోగస్ ఫిర్యాదులు తీసుకోకుండా ఏపీ సీఈఓను ఆదేశించాలని సీఈసీని కోరామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఓటర్ల ప్రొఫైలింగ్ చేస్తోందని ఆరోపించారు. కుల, మతాలు, ఉద్యోగం లాంటి వివరాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. విదేశాల నుంచి రెండు వెబ్ సైట్ లను నడుపుతూ అక్రమ హామీలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల కుటుంబాలకు బాండ్ లు జారీ చేయడం చట్ట విరుద్ధమని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఓట్లు వేసిన వ్యక్తులకు ఏపీలో ఓటు హక్కు కల్పించేలా టీడీపీ ఎన్రోల్ మెంట్ డ్రైవ్ చేస్తోందని ఆరోపించారు. డూప్లికేట్ ఓట్ల విషయంలో చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. సభల్లో సీఎం జగన్పై అసభ్య పదజాలంతో దూషిస్తున్న అంశాన్ని, అధికారుల లిస్ట్ అంటూ ఎర్ర బుక్ అని భయభ్రాంతికి గురి చేస్తున్న విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. లోకేశ్, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఈసీకి నివేదించామన్నారు. ఒకే దశలో ఏపీ తెలంగాణ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీనీ కోరామని చెప్పారు.