సర్వేనివేదికల ఆధారంగా పోటీ- నా సీటుపై స్పష్టత రాలేదు: ఎంపీ గోరంట్ల - MP Gorantla news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 30, 2023, 12:19 PM IST
YSRCP MP Gorantla Madhav Comments: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జుల మార్పులపై చేస్తోన్న కసరత్తులు హాట్ టాపిక్‌గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తాడేపల్లి ప్యాలెస్‌కు క్యూ కట్టడం చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై సీఎం జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Gorantla Madhav on Party Ticket: ''నేను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలా?, వద్దా? అనే విషయంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సర్వే నివేదికల ఆధారంగా ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై ఆయనే (జగన్) నిర్ణయం తీసుకుంటారు. సీఎంవో పిలుపు మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చాను. కానీ, నేను సీఎం జగన్‌ను కలవలేదు. నా సీటు విషయమై చర్చ జరిగింది. కానీ, ఇంకా స్పష్టత రాలేదు. నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయం సీఎం నిర్ణయించక ముందే నేనెలా చెబుతాను. నేను రాజకీయాల్లోనే ఉన్నాను. స్పష్టత వస్తే చెప్తా. '' అని హిందూపురం గోరంట్ల మాధవ్ అన్నారు.