కరోనాతో నా నియోజకవర్గం వెనుకబడింది- రహదారుల విస్తరణకు సీఎం అంగీకారం: మైలవరం ఎమ్మెల్యే వసంత
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 30, 2023, 1:46 PM IST
YSRCP MLA Vasanth Krishna Prasad: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైలవరం సీటు విషయంలో సీఎం జగన్ నిర్ణయమే శిరోధార్యమని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా - మైలవరం, జి.కొండూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత ప్రసాద్, 2019లో జగన్ చెబితేనే మైలవరంలో పోటీ చేశానని వెల్లడించారు. సీఎంఓ నుంచి ఫోన్ వచ్చిందని, అభివృద్ధి పనుల నిధుల కోసమే సీఎంను కలిసినట్లు వసంత తెలిపారు. సీఎంను కలవడం సోషల్ మీడియాలో యూనివర్సల్ సమస్యగా మారిందని ఎద్దేవా చేశారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నా, నియోజకవర్గంలో తన పని తనను చేసుకోమని సీఎం చెప్పారన్నారు. చిన్న విషయాలు పట్టించుకోవద్దు, స్పందించవద్దని సీఎం చెప్పారన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే సీఎంను కలవడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. కరోనా కారణంగా నియోజకవర్గంలో అభివృద్ధి వెనుకబడిన మాట వాస్తవమన్న ఎమ్మెల్యే వసంత, రెండు రహదారుల విస్తరణకు వెంటనే నిధులు విడుదల చేయమని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చినట్లు ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ తెలిపారు.