ఒకరిపై కక్ష, రైతులకు శిక్ష! - పొలాలకు వెళ్లే దారిని ధ్వంసం చేసిన వైఎస్సార్సీపీ నేత - జిల్లా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 7, 2024, 4:08 PM IST
YSRCP leaders tyranny in Nellore district:నెల్లూరు జిల్లాలో అధికార వైఎస్సార్సీపీ నాయకుల అగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. ఎవరైనా మా జోలికి వస్తే అంతే సంగతి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు. ఎదురు తిరిగితే వారిపై దాడులు, ఇబ్బందులకు గురిచేయడం ఇక్కడ పరిపాటిగా మారిపోయింది. న్యాయం చేయాల్సిన పోలీసులు తమకు అన్యాయం చేస్తున్న వారితోనే మాట్లాడుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తుండడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.
నెల్లూరు జిల్లా సంగం మండలం తలుపురుపాడులో వైస్సార్సీపీకి చెందిన నాయకుడు బాదుల్లా రైతులు పొలాలకు వెళ్లే దారిని జేసీబీతో తవ్వించేశారు. తలుపురుపాడు గ్రామస్థుడికి అధికార వైఎస్సార్సీపీ నాయకుడు బాదుల్లాకు మధ్య వివాదం జరిగింది. దీంతో ఆ వ్యక్తి తన పొలానికి వెళ్లే దారిలో మూడు చోట్ల తవ్వించేసి జేసీబీని అడ్డుగా పెట్టారు. ఆ వ్యక్తి మీద ఉన్న కక్షతో రైతులు పొలాలకు వెళ్లకుండా దారిని తవ్వించడం చర్చనీయంశంగా మారింది. స్థానిక రైతులు సైతం ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి పొలాల్లోకి వెళ్లేందుకు దారి లేక తీవ్రఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే, బాదుల్లాతో మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలంటూ ఉచిత సలహాలు ఇచ్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ పొలాలకు వెళ్లే దారిని పూడ్చాలని డిమాండ్ చేస్తున్నారు.