కదిరిలో వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధుల రాజీనామాల పర్వం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 31, 2023, 1:32 PM IST
YSRCP Leaders Resignations in Kadiri Constituency:వైఎస్సార్సీపీలో అసమ్మతి సెగ రగులుకుంటోంది. పార్టీ అధినేత జగన్ నియంతృత్వ పోకడలతో నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ బాధ్యుల నియామకం అలజడి రేపింది. వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. కదిరి ఎమ్మెల్యే టికెట్ సిద్ధారెడ్డికే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 16మంది మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామా లేఖను కమిషనర్‌కు అందించారు. ఇప్పటికే కదిరి, గాండ్లపెంట ఎంపీటీసీ, సర్పంచులు వారి రాజీనామా పత్రాలను స్థానిక ఎంపీడీవోకు సమర్పించారు. వారితోపాటు ఆలయ ధర్మకర్తలు, మండలి పాలకవర్గ సభ్యులు సైతం రాజీనామాలు చేశారు.
Sathya Sai District YSRCP Leaders Demands: కదిరి నియోజకవర్గ ఇంఛార్జ్(Kadiri Constituency Incharge) బాధ్యత స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి(MLA Siddareddy)కి కాదని మక్బూల్ అహమ్మద్(Maqbool Ahmed)కు అప్పగించడంతో వైఎస్సార్సీపీ నేతలు నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ఇంఛార్జ్ విషయంలో అధిష్టానం పునరాలోచించాలని ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వారంతా రాజీనామా పత్రాలు(Resignation Papers) కదిరి ఆర్డీవో(RDO) కు అందజేయాల్సి ఉండగా స్థానిక ఎంపీడీవో(MPDO) కు సమర్పించటం చర్చనీయాంశంగా మారింది.