YSRCP Leaders occupied cattle grazing land పశువుల మేత బీడు భూములను ఆక్రమించిన వైసీపీ నేతలు.. నిరసనకు దిగిన గ్రామస్థులు
YSRCP Leaders occupied cattle grazing land : గ్రామ పశువుల మేత బీడు భూమిని అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా ఆన్లైన్లో ఎక్కించుకోవడమే కాక అటు వెళ్లిన పశువులను, గ్రామస్తులను సైతం దాడి చేసి గాయపరుస్తున్నారని.. ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్డిఓ కార్యాలయం వద్ద పామూరు మండలానికి చెందిన గ్రామస్థులు ఆందోళనకు దిగారు. జిల్లాలోని పామూరు మండలం గుమ్మలంపాడు గ్రామానికి చెందిన సుమారు 80 ఎకరాల పశువుల మేత బీడు భూమిని అధికార పార్టీకి చెందిన కొందరు ఆక్రమించి ఆన్లైన్లో ఎక్కించుకున్నారని ఆర్డీవో కార్యాలయం ఎదుట గుమ్మలంపాడు గ్రామస్థులు ఆందోళన చేశారు. అనంతరం స్పందన కార్యక్రమంలో ఆర్డీవోకి తమ గ్రామానికి చెందిన పశువుల పారంబోకు బీడు భూమిని రక్షించాలంటూ వినతి పత్రం అందజేశారు. గుమ్మలంపాడు గ్రామం ఏర్పడి నప్పటి నుంచి గ్రామానికి పశువుల మేత కొరకు అప్పటి అధికారులు సుమారు 80 ఎకరాల వరకు భూమిని కేటాయించారని.. అప్పటి నుంచి తరతరాలుగా ఆ భూమిలో పశువులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నామని.. ప్రస్తుతం కొందరు నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆన్లైన్లో ఎక్కించుకోవడమే కాక ఆ భూమిలోకి వెళ్లిన గ్రామస్థులను, పశువులను గాయపరుస్తూ, దాడులు చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు జిల్లా కలెక్టర్ నుండి స్థానిక మండల ఎమ్మార్వో వరకు పలుమార్లు అర్జీలు ఇచ్చినప్పటికీ అధికారుల నుంచి స్పందన లేదని.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆక్రమణకు గురైన తమ గ్రామ భూమిని కాపాడి ఆక్రమించిన అక్రమార్కులపై చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.
TAGGED:
ప్రకాశం జిల్లాలో భు కబ్జా