Illegal Soil Transport: అనుమతులు ఒకలా.. తరలింపు మరోలా.. వైఎస్సార్సీపీ నాయకుల మట్టి రవాణా దందా - ఏపీ వార్తలు
YSRCP Leaders Illegal Soil Transport For Bricks : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు అక్రమ మట్టి రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఎన్ని ఆరోపణలు వస్తోన్న వారు మాత్రం అక్రమాలను సాఫీగానే కొనసాగిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరు మండలం చిన్న నందిగామ పెద్ద చెరువులో అనుమతులు ఉన్నాయని వైఎస్సార్సీపీ నేతలు ఇష్టారాజ్యంగా అక్రమంగా మట్టిని అమ్ముకుంటున్నారని సర్పంచ్ దనేకుల శ్రీకాంత్ ఆరోపించారు. గ్రామంలోని పెద్ద చెరువులో పొలాలకు మట్టి తొలుకోవాలనే నెపంతో అనుమతులు తీసుకోని.. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఇటుక బట్టీల యజమానులకు వందలాది ట్రిప్పుల మట్టిని అమ్ముకొని అక్రమంగా సొమ్ము సంపాదించుకుంటున్నారని సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ సర్పంచ్‌గా అన్యాయాన్ని ప్రశ్నిస్తే.. అధికార పార్టీ వారు అహంకారం చూపిస్తున్నారని శ్రీకాంత్ ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఎస్టీ, ఎస్సీ కేసులు, అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు దనేకుల సాంబశివరావు ఈ విషయంపై మాట్లాడుతూ ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ మట్టి దందాను అరికట్టి గ్రామ సమతూల్యతను కాపాడాలని డిమాండ్ చేశారు.