YSRCP Leaders Harassment: వైసీపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం - వైసీపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం
YCP Leaders Harassment: రాష్ట్రంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. ఇష్టమొచ్చినట్లు అరాచకాలకు పాల్పడుతూ.. అడ్డొచ్చిన వారిపై దాడులకు దిగుతున్నారు. నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. వైసీపీ శ్రేణుల అక్రమాలు, దాడులు భరించలేక ఎంతోమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా నంద్యాలలో ఖాదర్ అనే వ్యక్తి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. నంద్యాల దేవనగర్కు చెందిన ఖాదర్.. వ్యాపారం నిమిత్తం వైసీపీ నాయకుల వద్ద కొంత మొత్తం అప్పు తీసుకున్నాడు. కానీ వ్యాపారంలో నష్టం వాటిల్లింది. ఇదే సమయంలో అప్పు చెల్లించాలని వైసీపీ నాయకులు బెదిరించారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యకు యత్నించినట్లు బాధితుడు ఖాదర్ చెప్పాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖాదర్‌ను బంధువులు, టీడీపీ నాయకులు పరామర్శించారు. ఖాదర్‌ను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నంద్యాలలో నేరాల సంఖ్య పెరిగి పోతుందని టీడీపీ నాయకుడు ఎన్ఎండీ ఫిరోజ్ అన్నారు. ఖాదర్ పట్ల వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. పోలీసులు తీరు సరిగా లేకపోవడంతోనే వైసీపీ నాయకులు హద్దు మీరుతున్నారన్నారు. వైసీపీ నాయకులు అప్పులు ఇచ్చి, అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని.. ఆలస్యమైతే గూండాల్లా వ్యవహరిస్తున్నారని బాధితుడి సోదరి వాపోయారు.