Ysrcp Leaders Fight: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎదుట బాహాబాహీకి దిగిన నేతలు - AP NEWS LIVE UPDATES
Ysrcp Leaders Fight In Front Of MLA Pendem Dorababu: 'గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం'లో ఎమ్మెల్యే ఎదుటే ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులు బాహాబాహీకి దిగారు. ఈ ఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆదివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మూడవ వార్డులో ఇంటింటికీ తిరుగుతూ లబ్ధిదారులకు పథకాల గురించి వివరిస్తున్నారు. ఆ వీధిలో నుంచి ఎమ్మెల్యే పెండెం దొరబాబును పక్క వీధిలోకి తీసుకెళ్లేందుకు వైఎస్సార్సీపీ నేత మొగలి రాము ద్విచక్ర వాహనం తీసుకొని వచ్చారు. స్థానికంగా మిగిలిన లబ్ధిదారులతో మాట్లాడిన తరువా అటువైపు వెళ్లొచ్చని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు పర్ల రాజా అనడంతో వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగింది. పెండెం దొరబాబు ఎదుటే ఒకరిని ఒకరు తోసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఎస్ఐ వినయ్ ప్రతాప్, పోలీసు సిబ్బంది, మిగిలిన నేతలు వారిని ఆపారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత ఎమ్మెల్యే పెండెం దొరబాబు తన కారులో మొగలి రామును తీసుకోని వెళ్లిపోయారు. ఎమ్మెల్యే సాక్షిగా వైఎస్సార్సపీ నేతలు బహిరంగంగా బాహాబాహీకి దిగడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.