వైఎస్సార్సీపీలో వర్గపోరు - ఎమ్మెల్యే ఇంటి ముందే కత్తులతో దాడి చేసుకున్న నేతలు - కత్తిపోటు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 7, 2024, 7:48 PM IST
YSRCP leaders attacked with knives: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్సీపీలో వర్గ విభేదాలు భగ్గమంటున్నాయి. అవి ఎంతలా అంటే, ఎమ్మెల్యే నివాసం వద్దే కత్తులతో పొడుచుకునేంతలా! అధికార వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యే ఇంటి ముందు పార్టీ నేతలు, కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఒక్కరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇరువర్గాల మధ్య మాటా మాటపెరిగి కత్తులతో దాడి చేసుకున్న ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.
నూజివీడు శాసనసభ్యుడు మేక వెంకట ప్రతాప్ అప్పారావు నివాసం వద్ద వైఎస్సార్సీపీ నాయకుల మధ్య జరిగిన గొడవలో ఓ యువకుడికి 10 కుట్లు, మరొకరికి 4 కుట్లు పడ్డాయి. కత్తి పోటులో గాయపడిన వారికి స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మెుదట వైఎస్సార్సీపీ యువ నాయకులు మేకల అనిల్, రంగబాబు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ గొడవ కాస్తా, చిలికి చిలికి గాలివానలా మారింది. చివరకు ఇరు వర్గాలు కత్తి దాడి చేసుకొనే వరకు చేరుకోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కత్తి దాడి నేపథ్యంలో నూజివీడు పట్టణం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎమ్మెల్యే ఇంటి ముందే కత్తులతో దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎమ్మెల్యే నివాసంతో పాటుగా, నూజివీడు పట్టణం పెద్ద గాంధీ బొమ్మ కూడలి వద్ద పోలీసులు ముందస్తుగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎలాంటి వాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు చేశారు.