YSRCP Leaders Attack on Lady Principal స్కూలుకు తాళం వేసి.. విద్యార్థులను బయటకు పంపి.. ప్రధానోపాధ్యాయురాలిపై దాడి! - శ్రీకాకుళంలో జిల్లాలో హెచ్ఎంపై వైసీపీ నేత దాడి
YSRCP Leaders Attack on Lady Principalశ్రీకాకుళం జిల్లా టెక్కలిలో విద్యాబుద్ధులు చెప్పే ప్రధానోపాధ్యాయురాలిపై అధికార వైసీపీ నాయకుడు చేయి చేసుకున్నాడు. పాఠశాల గదికి తాళాలు వేసి వీరంగం సృష్టించాడు. టెక్కలిలోని.. ఎన్టీఆర్ నగర్ ప్రాథమిక పాఠశాలలో 2019-21 మధ్య పాఠశాలలో నిర్వహించిన మరమ్మతుల బిల్లుల చెల్లింపుల కోసం సంతకాలు చేయాలని.. స్థానిక వైసీపీ నాయకుడు దుప్పల శ్రీనివాసరావు ప్రధానోపాధ్యాయురాలిని కోరారు. ఈ బిల్లులకు సంబంధించిన పనులు జరిగిన సమయంలో తాను ఇక్కడ పని చేయలేదని, సమర్పించిన పత్రాల్లో ఎటువంటి వివరాలు లేవని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. అయినా బిల్లుపై సంతకం చేయాలని ప్రధానోపాధ్యాయురాలిపై వైసీపీ నాయకుడు ఒత్తిడి చేశాడు. బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చిన సదరు వైసీపీ నాయకుడు.. ఇష్టారీతిన ప్రవర్తించాడు. విద్యార్థుల్ని బయటకు పంపించేసి రెండు గదులకు తాళాలు వేసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత కాసేపటికి మళ్లీ వచ్చి ప్రధానోపాధ్యాయురాలిపై చేయిచేసుకున్నాడు. మండల విద్యాశాఖాధికారి దీనిపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు విద్యాశాఖ అధికారులు వెనకడుగు వేస్తున్నారు.