YCP Local Leader Anarchy: 'దేవుడు కరుణించినా.. వరమివ్వని పూజారి' - స్థలాలను చదును చేసి జగనన్న లేఔట్
YSRCP leader Blocking Construction House : కొందరి అధికార పార్టీ నేతలు పేద ప్రజల కష్టాన్ని దొచుకుంటూ..పేదవాడి కడుపు కొడుతున్నారు. తమ రెక్కల కష్టం సరిపోక అప్పు చేసి ఇంటిని నిర్మించుకుంటుంటే పలుమార్లు నేలమట్టం చేశాడు. ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే అనుమతి ఇచ్చారు. కానీ వైసీపీ నేత మాత్రం ఎమ్మెల్యే మాటను సైతం లెక్క చేయకుండా తన గుండాయిజాన్ని బక్క ప్రాణులపై ప్రదర్శిస్తున్నాడు. ప్రస్తుతం ఆ కుంటుంబం పరిస్థితి 'దేవుడు కరుణించినా పూజారి వరం ఇవ్వటం లేదు' అన్నట్లుగా తయారైంది.
అనంతపురం జిల్లా గుంతకల్లు శివారు దోనిముక్కల రస్తాలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇంటి నిర్మాణానికి బేస్‌మట్టం వేస్తే.. స్థానిక వైఎస్సార్సీపీ నేత నేలమట్టం చేశారని బాధితుడు లోకేశ్ వాపోయారు. బాధితుడి భార్య లింగమ్మకు 2008లో అప్పటి ప్రభుత్వం నివేశన స్థలం మంజూరు చేసింది. సదరు స్థలంలో ఇంటి నిర్మాణానికి అప్పు చేసి మరీ బేస్‌మట్టం వేస్తే.. దానికి బిల్లును కూడా చెల్లించారని లోకేశ్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక.. సదరు స్థలాలను చదును చేసి జగనన్న లేఔట్ వేశారని అవేదన వ్యక్తం చేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ గోడును వెళ్లబోసుకున్నట్లు బాధితులు వివరించారు. ఆయన హామీతో మరోసారి 2 లక్షలు అప్పు చేసి బేస్‌మట్టం వేశామని వారు తెలిపారు. దానిపై పురిపాక వేసుకుని జీవిస్తున్నారు. అయితే స్థానిక వైసీపీ నేత గోపాల్ తాము లేని సమయంలో జేసీబీతో బేస్‌మట్టాన్ని నేలమట్టం చేశారని ఆ కుటుంబం కన్నీటీపర్యంతం అయింది. తాము చీపుర్లు అమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, ఎమ్మెల్యే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.