Payyavula fire on YSRCP: జగన్ ప్రభుత్వం మరో భారీ కుంభకోణానికి తెరలేపింది : పయ్యావుల కేశవ్ - TDP leader Payyavula Keshav news
TDP leader Payyavula Keshav fires on YSRCP govt: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుల పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపిందని ఆరోపించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రూ.3 వేల కోట్ల అప్పులో ఈ రాష్ట్ర ప్రభుత్వం రూ.900 కోట్లను నేరుగా ప్రైవేట్ కాంట్రాక్టర్ ఖాతాలో జమ చేసిందని పయ్యావుల కేశవ్ దుయ్యబట్టారు. ఈ భారీ కుంభకోణంలో ప్రధాన పాత్రధారులు, సూత్రధారులు బయటికి వచ్చేలా సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
భారీ దోపిడీకి తెరలేపిన జగన్ ప్రభుత్వం.. ప్రాజెక్టుల పేరుతో అధికార పార్టీ చేస్తున్న అప్పులు, రాష్ట్ర ఆర్థికశాఖ నిర్వహణ వ్యవస్థలో లోటుపాట్లపై ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుల పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపింది. ప్రాజెక్టులకు లిఫ్ట్ ఇరిగేషన్ పనుల కోసమంటూ.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రూ. 3వేల కోట్ల రుణంలో రూ.900 కోట్లను నేరుగా ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు చెల్లించింది. దీంతోపాటు ప్రాజెక్టులకు ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ కోసమంటూ కోట్లల్లో అప్పు తెచ్చింది. కానీ, ఆ తాలూకూ పనులే జరగలేదు. ఒకవేళ పనులు జరిగితే ఎక్కడ జరిగాయో ఈ ప్రభుత్వం చూపించాలి. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి. ప్రభుత్వ ఖజానాలోకి నగదు జమ కాకుండా నేరుగా కాంట్రాక్టర్‌కు చెల్లింపులు చేయటంతో దేశం నివ్వెరపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ కుంభకోణానికి సంబంధించి రానున్న రోజుల్లో మరిన్ని ఆధారాలను దశలు వారీగా బయటపెడతాం.'' అని అన్నారు.