'రహదారి బంద్'గా మారిన వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికారత బస్సు యాత్ర - మార్కాపురం జగన్ సాధితకార బస్సు యాత్ర
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 6, 2023, 5:02 PM IST
YSRCP Bus Yatra Problems in Prakasam District : వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికారత బస్సు యాత్ర అక్టోబర్ 26న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ ప్రజలకు చేరువ కావడానికి దోహదపడాల్సిన ఈ యాత్ర ప్రజలకు తీవ్ర ఇబ్బందులను తెచ్చి పెడుతోంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైసీపీ సాధికార బస్సు యాత్ర నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు పెట్టారు. మార్కాపురంలో సాధికార యాత్ర సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గడియార స్తంభం ప్రధాన రహదారిపై సభా వేదిక ఏర్పాటు చేశారు. రహదారికి ఇరువైపులా బారికేడ్లు పెట్టారు. దీంతో రాకపోకలు సాగించటానికి వాహనాదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Road Closed Due to Bus Yatra in Markapuram : సామాజిక సాధికార యాత్ర రోడ్డు బంధ్ కార్యక్రమంలా మారుతోంది. ట్రాఫిక్ ఆంక్షలతో అంబులెన్సు సైతం వేచి ఉండాల్సిన ఘటనలు జరుగుతున్నాయి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఏకంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించవలసిన పరిస్థితి నెలకొంది. పాఠశాలలు, కళాశాలల బస్సులు యాత్రకు కావాలని తీసుకువెళ్లడంతో ఇలా జరిగిందని యాజమాన్యం తెలిపిన సంగతి విదితమే. ఇలా వరుసగా ప్రజా కలాపాలకు భంగం కలిగిస్తూ రోజుకో సమస్యతో సాధికారత బస్సు యాత్ర సాగుతోందంటున్నారు ప్రజలు.