YSRCP leaders clashes నడిరోడ్డుపై బాహాబాహీకి దిగిన అధికార పార్టీ నేతలు.. వీడియో వైరల్ - Prakasam district YSRCP leaders news
YSR Congress party leaders were beaten: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు.. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల నేతలు నడిరోడ్డుపై బాహాబాహికి దిగిన సంఘటన సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో అధికార పార్టీ (వైఎస్సార్సీపీ)కి చెందిన రెండు వర్గాల నేతలు నడిరోడ్డుపై బాహాబాహికి దిగారు. టంగుటూరు జాతీయ రహదారిపై ఉన్న ఓ టీ దుకాణంలో వెంకయ్య అతని అనుచరులతో కలిసి టీ తాగుతున్నారు. వెంకయ్య అక్కడ ఉన్నారని తెలుసుకున్న అశోక్ బాబు.. అతని అనుచరులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో వెంకయ్య వర్గం టీ దుకాణం నుంచి వెళ్లి పోయేందుకు ప్రయత్నిస్తుండగా.. అశోక్ బాబు వర్గీయుల రెచ్చగొట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి.. ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాల ఘర్షణలో వెంకయ్య అనుచరుడు సాయికి గాయాలయ్యాయి. వెంకయ్యకు దెబ్బలు తగలకుండా ఆయన అనుచరులు అడ్డుకుని.. కారు ఎక్కించి పంపించారు.అక్కడి స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించి, అక్కడ నుంచి పంపించేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.