YS Vivekananda Reddy Murder Case Investigation Updates: వివేకా హత్య కేసుపై సీబీఐ కోర్టులో విచారణ.. తదుపరి విచారణ ఎప్పుడంటే? - Vivekananda Reddy Murder Case Investigation news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2023, 10:21 PM IST
YS Vivekananda Reddy Murder Case Investigation Updates: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. విచారణలో భాగంగా హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డితోపాటు భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉదయ శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు సీబీఐ కోర్టు విచారణకు హాజరయ్యారు.
కోర్టు హాల్లో 15 నిమిషాలు మాట్లాడుకున్న తండ్రి, కుమారుడు.. వివేకా హత్య కేసు విచారణలో నిందితుల తరపు న్యాయవాదులు, సీబీఐ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ముందుగా విచారణలో నిందితులకు సంబంధించిన అభియోగపత్రం కాపీలను ఇవ్వాలని నిందితుల తరుఫు న్యాయవాదులను కోర్టును కోరారు. దీంతో డిజిటల్ కాపీల రూపంలో ఇప్పటికే అందించామని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు పేర్కొన్నారు. దాంతో డిజిటల్ కాపీలు కాకుండా.. జిరాక్స్ పత్రాలను ఇవ్వాలని నిందితుల తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22న అందిస్తామని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. న్యాయవాదుల వాదోపవాదాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఈ క్రమంలో తండ్రి, కుమారులైనా వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు సీబీఐ కోర్టు అనుమతితో.. దాదాపు 15 నిమిషాలు కోర్టు హాల్లోనే మాట్లాడుకున్నారు. అనంతరం ఆరుగురు నిందితులను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు.