ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనంతపురం జిల్లాలో యువకుడి ఆత్మహత్యాయత్నం

ETV Bharat / videos

Selfie Suicide Video: అనంతలో యువకుడి సెల్ఫీ వీడియో కలకలం.. పోలీసులే కారణమంటూ..

By

Published : May 23, 2023, 7:31 PM IST

Youth Selfie Suicide attempt Video: తమను చంపేందుకు ఎదురింటివారు వస్తున్నారని పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించగా.. తిరిగి పోలీసులే తనపై కేసులు నమోదు చేసి.. తనను విచక్షణారహితంగా కొట్టి వేధిస్తున్నారంటూ ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఓ సెల్ఫీ వీడియో తీసి.. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఈ ఘటన అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెల గ్రామంలో జరిగింది.  

సమాచారం ప్రకారం.. తరిమెల గ్రామానికి చెందిన రాజేష్​కు.. తన ఎదురింటి వారితో గత పది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల రాజేష్ తన మామతో కలిసి బయటకు వెళ్తుండగా ఓ వ్యక్తి అక్కడికి వచ్చి వారిపై కర్రలతో దాడి చేశాడు. రాజేష్ అక్కడి నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు వారిపై చర్యలు తీసుకోకుండా తిరిగి తనపైనే రేప్ కేసు పెట్టి.. తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారంటూ ఆ యువకుడు ఆరోపించాడు. పోలీసులు తనకు న్యాయం చేయకుండా అవతల వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశాడు.  

తాను ఆత్మహత్య చేసుకోవటానికి కారణం తన ఎదురింటివారు, పోలీసులేనని వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. సూపర్​ వాస్మల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో రాజేష్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన కొన్ని గొడవల కారణంగానే రాజేష్​ను చంపే ప్రయత్నం చేస్తున్నారంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details