Youngsters Under Influence of Alcohol: మద్యం మత్తులో బీభత్సం.. పోలీసులపైనా ఎదురు తిరిగిన యువకులు - ఏపీ ముఖ్యవార్తలు
Youngsters Under Influence of Alcohol : మద్యం మత్తులో ఐదుగురు యువకులు వీరంగం సృష్టించారు. మత్తులో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ప్రతి ఒక్కరినీ దూషించడంతో పాటు.. ఒక దశలో పోలీసులపైనా ఎదురుతిరిగారు. చివరకు పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వివరాలివీ.. నంద్యాలలో ఎన్జీఓ కాలనీకి చెందిన ఐదుగురు యువకులు మద్యం సేవించి స్థానికంగా వీరంగం సృష్టించారు. ఒకరికొకరు ఘర్షణ పడడంతో పాటు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ హల్ చల్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్లి యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్కు తరలించడానికి ముందు వైద్య పరీక్షల కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆ యువకులు అక్కడ కూడా హల్ చల్ చేశారు. ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన సెక్యూరిటీ గార్డుపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల ఎదుట దాడి చేయడంతో పాటు.. పోలీసులకూ ఎదురు తిరిగే పరిస్థితి నెలకొంది. ఆస్పత్రి వార్డులో కుర్చీలను ఎత్తి కొట్టుకోవడంతో ఆస్పత్రి సిబ్బంది, నర్సులు భయాందోళనకు గురయ్యారు. దాదాపు పది మంది పోలీసులు అతి కష్టమ్మీద యువకులను అదుపులోకి తీసుకుని నంద్యాల టూటౌన్ స్టేషన్కు తరలించారు.