YCP ward Members Resign: వైసీపీలో ముదురుతున్న వర్గ విభేదాలు.. నలుగురు వార్డు సభ్యుల రాజీనామా - AP Latest News
YCP ward Members Resign in Brahmanapalli: వైసీపీలో అంతర్గత విభేదాలు రాష్ట్రంలో రోజూ ఏదో ఒక చోట బయటపడుతూనే ఉన్నాయి. ఆదిపత్య ధోరణి వల్ల పార్టీ నుంచి చాలా మంది నాయకులు ఇమడలేక తమ పదవులకు రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. తాజాగా నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం బ్రాహ్మణపల్లి పంచాయితీలో.. అధికార పార్టీకి చెందిన నలుగురు వార్డు సభ్యులు రాజీనామా చేయటం తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో పంచాయతీ ఉప ఎన్నికలు జరిగిన వెంటనే వార్డు సభ్యులు రాజీనామా చేయడం జిల్లా మెత్తం సంచలనంగా మారింది. వార్డు సభ్యులు సుబ్బలక్ష్మమ్మ, అనురాధ, సుధారాణి, స్వర్ణలత.. తమ రాజీనామా పత్రాలను ఎంపీడీవో మహబూబ్ దోలాకు అందజేశారు. పంచాయితీ ఉప ఎన్నికలు జరిగిన మూడు రోజులకే.. వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరటం గమనార్హం. మరో వర్గంతో కలిసి ఉండలేకనే.. వీరు రాజీనామా చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు మీడియాకు తెలిపారు.