YCP Vs TDP In Srikakulam : దేవస్థానం ఈవోపై వైసీపీ నాయకుల దౌర్జన్యం.. ఆలయం నుంచి వెళ్లిపోవాలంటూ నెట్టివేత - శ్రీకాకుళం తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 17, 2023, 3:58 PM IST
YCP Vs TDP In Srikakulam : శ్రీకాకుళం జిల్లా.. కోటబొమ్మాళి మండలంలో జరుగుతున్న కొత్తమ్మతల్లి జాతరలో టీడీపీ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఓవైపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మరోవైపు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు దేవస్థానంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. వైసీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ వాణి దర్శనానికి వచ్చినప్పుడు ప్రొటోకాల్ పాటించలేదంటూ వాణి అనుచరులు దేవస్థాన ఈవో వాచకర్ల రాధాకృష్ణపై దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డారు. అంతటితో ఆగిపోకుండా ఆలయం నుంచి బయటకు వెళ్లిపోవాల్సిందిగా నెట్టేశారు. పోలీసులు అడ్డుపడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
YCP Bad Behaviour in Temple: ఒకే సమయంలో ఇరుపార్టీల నేతలు ఆలయానికి రావడంతో దేవాదాయశాఖ అధికారులకు ఏంచేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు టీడీపీ, వైసీపీ వర్గీయులు పార్టీ నినాదాలతో కేకలు వేయడం గందరగోళ పరిస్థితికి దారితీసింది. వైసీపీ నాయకుల దురుసు ప్రవర్తనతో బయటకు వెళ్లిపోయిన ఈవోను కాసేపటి తర్వాత దువ్వాడ వాణి పిలిపించి మాట్లాడారు. దేవస్థాన పాలకమండలి సమావేశాన్ని నిర్వహించి జరిగిన లోపాలపై మండిపడ్డారు. కార్యకర్తలు ఆవేదనతో దురుసుగా ప్రవర్తించారని, తానేం చేయగలనని నిస్సహాయత వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తల దురుసుప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి.