టీడీపీలో చేరేందుకు సిద్ధమైన ఇద్దరు వైసీపీ సర్పంచులు - అర్ధరాత్రి సభను ధ్వంసం చేసిన పోలీసులు - పోలీసుల అత్యుత్సాహం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 7, 2024, 1:37 PM IST
YCP Two Sarpanches MPTC Have Joined TDP:కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అవినీతి, అక్రమాలు నచ్చకపోవటంతో ఇద్దరు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సహా మండల వైసీపీ నాయకులు అధికార పార్టీని వీడి తెలుగుదేశంలో చేరాలని నిర్ణయించుకున్నారు. సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాటసాని సభను అడ్డుకోవాలని పోలీసులు, అధికారులను ఆదేశించారు. అర్ధరాత్రి పాలకొలను వచ్చిన పోలీసులు టెంట్లు తొలగించి స్టేజ్‌ను కూల్చేశారు. గ్రామంలో టీడీపీ సభ పెట్టకూడదని హెచ్చరించారు. పోలీసుల దౌర్జన్యంపై సదరు నాయకులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ విధానాలు, ఎమ్మెల్యే కాటసాని అవినీతి సహించలేక పార్టీని వీడుతున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు. అధికార పార్టీ బెదిరింపులకు భయపడబోమని తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
పార్టీ విధానాలు, ఎమ్మెల్యే కాటసాని చేసే అరాచకాలు, ప్రజల్లో వ్యతిరేకతను చూసి టీడీపీలోకి చేరాలని నిర్ణయించుకున్నాం. టీడీపీలోకి చేరేందుకు సభను ఏర్పాటు చేస్తే రాత్రి సమయంలో దాదాపు 30మంది పోలీసులు వచ్చి టెంట్‌ను, స్టేజిని కూల్చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే ఏదో చేయాలనుకుంటే అది టీడీపీకి అనుకూలంగా మారుతుంది. మేమంతా కలసి తెలుగుదేశం పార్టీకి పనిచేసి విజయం సాధించేందుకు కృషి చేస్తాం.-సుధాకర్ రెడ్డి, పాలకొలను