Land grabbing: భూకబ్జాలు, దౌర్జన్యాలు పెరిగాయి.. అధికార పార్టీ నేత సంచలన ఆరోపణలు - అనంతపురం జిల్లా వీడియోలు
YCP leaders land grabbing: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో భూకబ్జాలు, వైకాపా నేతల దౌర్జన్యాలు మితిమీరాయని.. సొంత పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధుసూధన్ రెడ్డి చెప్పడం విస్మయం కల్గిస్తోంది. కూడేరు, ఉరవకొండ మండలాల్లో ముఖ్య నాయకులు, వారి అనుచరుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని... లేకుంటే పార్టీకి చెడ్డపేరు వస్తుందని.. మధుసూదన్ రెడ్డి అన్నారు. దీనిపై అధికారులు స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో 2019 నుంచి ఈ నాలుగేళ్ల కాలంలో కూడేరు, ఉరవకొండ మండలాల్లో భూ కబ్జాలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వై. మధుసూదన్ రెడ్డి ఆరోపణలు చేశారు. భూ కబ్జాలపై దౌర్జన్యాలు చేస్తున్న అధికార పార్టీ నాయకులపై సీఐడీ చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సొంత పార్టీ ముఖ్య నాయకులు, అనుచరులపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేసి ప్రజాభిమానాన్ని పొందుతుంటే.. ఉరవకొండ నియోజకవర్గంలోని కొందరు వైసీపీ నేతలు వారి అనుచరులు కూడేరు, ఉరవకొండ మండలాల్లో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని వై. మధుసూదన్ రెడ్డి ఆరోపించారు.
భూ కబ్జాలకు అడ్డువచ్చిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడడం పరిపాటిగా మారిందని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. ఈ చర్యల వల్ల వైసీపీ ప్రతిష్ఠ దెబ్బతింటుందన్నారు. ఈ నాలుగేళ్లగా వైసీపీ నేతలు పాల్పడిన భూ కబ్జాలు, దౌర్జన్యాలపై పత్రికలు, మీడియాలలో వచ్చిన కథనాలపై ఉన్నతాధికారులు.. వైసీపీ అధిష్ఠానం స్పందించి విచారణ జరిపించాలని మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. సొంత పార్టీ నాయకుల అక్రమాలపై వరుస కథనాలు వెలువడుతున్నా స్పందించి ఖండించకపోవడం చూస్తే అక్రమాలు నిజమన్న భావన కలుగుతుందని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు.