'దళిత సమాజమంతా సీఎం జగన్కు బాసటగా నిలుస్తుంది' - YCP SC ministers
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 10:22 AM IST
YCP SC ministers and leaders met CM YS Jagan: వివిధ ఆందోళనలు సమయంలో మాలలు, మాదిగలపై పెట్టిన కేసులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలిసి ఎస్సీ మంత్రులు, ఇతర ఎస్సీ ప్రజా ప్రతినిధులు, నాయకులు జీవో జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీలపై చంద్రబాబు హయాంలో కేసులు పెట్టి వేధించారని, ఎస్సీలను తీవ్రంగా దెబ్బతీశారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అంబేద్కర్ ఆలోచనలను ఈ ప్రభుత్వం అమలు చేసిందని, ఏ సమస్య ఉన్నా నేరుగా చెప్పుకునే అవకాశాన్ని ముఖ్యమంత్రి కల్పించారని వెల్లడించారు. దళితుల బాధలు, కష్టాలు ఆయనకు తెలుసని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
దళిత సమాజమంతా సీఎం జగన్కు బాసటగా నిలుస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను దెబ్బతీయడానికి ప్రత్యర్థులంతా ఏకం అవుతున్నారని, ఈ సమయంలో కుడిభుజంగా దళితులు నిలబడి పనిచేస్తారని, రాబోయే ఎన్నికల్లో 29 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మాల, మాదిగ మహానాడు ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాలల్లో పెట్టి కేసులు ఉపసంహరించే విధంగా చర్యలు చేపట్టనున్నారని తెలిపారు. మందకృష్ణపై ఉన్న కేసులను సైతం తీసేసినట్లు జూపూడి తెలిపారు.