వైసీపీ బస్సు యాత్రకు వచ్చారు - మధ్యలోనే మద్యం దుకాణానికి పరుగులు తీశారు - వైసీపీ బస్సు యాత్రలో మందు బాబులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 12, 2023, 9:26 PM IST
YCP Samajika Sadhikara Bus Yatra: అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైసీపీ ప్రభుత్వం సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమం నిర్వహించింది. బస్సు యాత్ర మన్నురూ ఎల్లమ్మ ఆలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్, ఆర్అండ్బీ, మార్కెట్ మీదుగా కొనసాగింది. ఈ కార్యక్రమం కోసం మహిళా సంఘాలను పెద్ద ఎత్తున తరలించారు. కార్యక్రమం ప్రారంభం కాకముందే, బస్సు యాత్ర కోసం వచ్చిన పురుషులు మద్యం దుకాణాల వైపు పరుగులు తీశారు. అనంతరం బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకొని చిందులు వేశారు. సభాస్థలిపై స్కూల్ విద్యార్థులచే నృత్యాలు చేయించారు.
సభ ప్రారంభమైన అనంతరం ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ప్రసంగిస్తుండగా, పురుషులు మధ్యలోనే వెళ్లి ప్రక్కనే ఉన్న మయూర బార్లో మందేస్తూ చిందులేశారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక ప్రసంగిస్తున్న సమయంలో మహిళలు వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. వారిని ఆపేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేసినా మహిళలు కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. బస్సు యాత్రలో భాగంగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కూడలి వైపు వచ్చే వాహనాలన దారి మళ్లించడంతో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.